ఐసీసీలో ముగిసిన శశాంక్ మనోహర్ ఇన్నింగ్స్.. తాత్కాలిక చైర్మన్‌గా ఇమ్రాన్ ఖవాజా

  • నిన్నటితో ముగిసిన శశాంక్ పదవీ కాలం
  • ఐసీసీ చైర్మన్ రేసులో గంగూలీ, కొలిన్ గ్రేవ్స్
  • సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడిన గంగూలీ పోటీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్ శశాంక్ మనోహర్ ఇన్నింగ్స్ నిన్నటితో ముగిసింది. 2015లో పదవీ బాధ్యతలు స్వీకరించిన మనోహర్ తొలి రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మరో రెండేళ్లు పాటు చైర్మన్‌గా కొనసాగారు. నిబంధనల ప్రకారం మరోమారు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఇక కొనసాగకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.

కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే వరకు వైస్ చైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖవాజా (హాంకాంగ్) తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతారని ఐసీసీ పేర్కొంది. వచ్చే వారం జరిగే బోర్డు సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఆమోదం తెలపనున్నారు. కాగా, ఐసీసీ చైర్మన్ పదవి రేస్‌లో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, ఈసీబీ మాజీ చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ముందు వరుసలో ఉన్నారు. మరోవైపు ఖవాజా కూడా రేసులోనే ఉన్నారు. దీంతో త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

అయితే, బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లలో కార్యవర్గ సభ్యుడిగా గంగూలీ పదవీ కాలం ఈ నెల 31తో ఆరేళ్లు పూర్తవుతుంది. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం మరో పదవి చేపట్టాలంటే కనీసం మూడేళ్ల విరామం ఉండాలి. దీంతో ఈ విషయంలో సడలింపు కోరుతూ గంగూలీ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవికి పోటీపడతాడా? లేదా? అన్నది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుంది.


More Telugu News