మేం ఆదాయం కోల్పోయినా నిషేధానికే మద్దతు.. భారత 'టిక్‌టాక్‌' ‌స్టార్లు!

  • టిక్‌టాక్‌ వల్ల వేలాది రూపాయల సంపాదన
  • చాలా మందికి మిలియన్ల మంది ఫాలోవర్లు 
  • టాలెంటే ముఖ్యమంటోన్న టిక్‌టాక్‌ స్టార్లు
  • ఇకపై ఇతర ఫ్లాట్‌ఫాంను వాడతామని స్పష్టం
  • కేంద్ర ప్రభుత్వ చర్యలకు పూర్తి మద్దతు
చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి చెందిన ముఖ్యమైన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. కోట్లాది మంది భారతీయులు వినియోగించే టిక్‌టాక్‌ యాప్‌ కూడా ఆ జాబితాలో ఉండడంతో ఇకపై ఆ యాప్‌ను వినియోగించుకునే వీలు లేకుండా పోయింది. భారత్‌లో ఆ యాప్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆ యాప్ వల్ల వేలాది మంది పెద్ద మొత్తంలో డబ్బులు కూడా సంపాదించేవారు.

మిలియన్లలో ఫాలోవర్లు ఉన్న టిక్‌టాక్‌ స్టార్లకు  వీడియోల వల్ల నెలకు వేలాది రూపాయలు వచ్చేవి. ఢిల్లీలోని నిహారిక జైన్ (23) అనే అమ్మాయి ఈ యాప్‌ ద్వారా నెలకు రూ.30,000 వేల వరకు సంపాదించేది.‌ ఆమెకు యాడ్‌  వీడియోలు బాగా వచ్చేవి. నిహారికకు అందులో 2.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇప్పుడు ఆమెకు ఆ సంపాదన పోయింది. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధం విధించడాన్ని ఆమె సమర్థించింది. అయితే, తాను ఇకపై ఇతర ప్లాట్‌ఫాంను వెతుక్కోవాల్సి ఉందని చెప్పింది.

'మేము కంటెంట్ క్రియేటర్లం. మా టాలెంటే మమ్నల్ని పాప్యులర్ చేసింది. టిక్‌టాక్‌ లేకపోతే వేరే ఫ్లాట్‌ఫాంపై నా టాలెంట్‌ను ప్రదర్శిస్తాను' అని తెలిపింది. ఆమె ట్రెండింగ్ స్టైల్, ఫ్యాషన్ దుస్తుల వంటి వీడియోలను అధికంగా పోస్ట్ చేసేది. గత ఏడాది ఆగస్టులో ఆమె టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని నెలల్లోనే 2.8 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. వివిధ సంస్థలకు ప్రచారంగా వీడియోలు చేయడం వల్ల ఒక్కో వీడియోకు ఆమెకు రూ.15 వేల నుంచి రూ.30 వేలు వచ్చేవి.

ప్రభుత్వం విధించిన బ్యాన్‌ షాక్‌కు గురి చేసినప్పటికీ, సర్కారు తీసుకున్న చర్యలను తాను అర్థం చేసుకున్నానని చెప్పింది. ప్రధాని మోదీ తీసుకున్న ఈ చర్యకు తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని పేర్కొంది. తాను ప్రతిరోజు టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేస్తుండేదానన్ని తెలిపింది.

ఆమెలా టిక్‌టాక్‌ ద్వారా సంపాదిస్తోన్న స్టార్లు భారత్‌లో ఇంకా చాలా మందే ఉన్నారు. వారు కూడా ఇకపై ఇతర ఫ్లాట్‌ఫాంను వెతుక్కుంటామని చెప్పారు. టిక్‌టాక్‌కు దేశంలో 200 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ యాప్‌ను అధికంగా వాడేవారు.

ఫరీదాబాద్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్‌ సుకృత్ జైన్ (23)‌ ఆ యాప్‌ బ్యాన్‌పై స్పందించాడు. టిక్‌టాక్‌ ద్వారా తను కూడా డబ్బు సంపాదించేవాడు. 'టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేస్తే ఏమీకాదు. అద్భుతమైన కంటెంట్‌కు అడ్డు ఉండదు. నా టాలెంటే నాకు పేరు తెచ్చింది. టిక్‌టాక్‌ కాకపోతే మరో ఫ్లాట్‌ఫాంను వినియోగించుకుంటాను' అని చెప్పాడు. తన కంటెంట్‌ను కొనసాగించడానికి ఆయన ఇప్పటికే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బీజేపీ నేత సొనాలి ఫొగట్‌కు టిక్‌టాక్‌లో 2,80,000 మంది ఫాలోవర్లు ఉండేవారు. దాని వల్ల ఆమెకు గొప్ప పేరు వచ్చింది.

ఆమె డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేసేవారు. ఆమె 13 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటోంది. ఆదాయ వనరుగా కాకపోయినా ఆమెకు టిక్‌టాక్‌ బాగా ఉపయోగపడింది. ఆమె గతంలో పలు సినిమాల్లోనూ నటించింది. తన సొంత రాష్ట్రం హర్యానాలో ఎంతో మంది తన టిక్‌టాక్‌ వీడియోలను చూసేవారని తెలిపింది.

'ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను మద్దతు తెలుపుతున్నాను. ఆ యాప్‌లు, చైనా ఉత్పత్తుల ద్వారా మన కోట్లాది రూపాయల డబ్బు చైనాకు వెళ్తోంది. ఆర్థికంగా చైనా మన వల్ల బలపడుతోంది. ఇప్పడు మన సైనికులపైనే దాడులు చేస్తోంది. మనం ఇతర యాప్‌లను వినియోగించుకోవచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ వంటి వాటిల్లోనూ నేనున్నాను. అయితే, ఈ యాప్‌లను పోలిన భారతీయ యాప్‌ కూడా మనకు ఒకటి ఉంటే బాగుంటుంది' అని తెలిపింది. ఇలాగే, దేశంలోని చాలా మంది టిక్‌టాక్ స్టార్లు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు.


More Telugu News