అయ్యన్నపాత్రుడ్ని వెనకేసుకొచ్చిన లోకేశ్ ఈ కేసులో బాధపడడం హాస్యాస్పదం: వాసిరెడ్డి పద్మ
- నెల్లూరు జిల్లా టూరిజం విభాగంలో మహిళపై అధికారి దాడి
- మహిళా ఉద్యోగినిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
- చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఎస్పీకి ఆదేశాలందాయని వెల్లడి
నెల్లూరు జిల్లా టూరిజం విభాగం కార్యాలయంలో ఉషారాణి అనే కాంట్రాక్ట్ ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఓ దివ్యాంగురాలు అని కూడా చూడకుండా అత్యంత హేయంగా కొట్టాడు. ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. నెల్లూరు వచ్చి బాధితురాలిని పరామర్శించారు. ఏడు రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. అయ్యన్నపాత్రుడ్ని వెనకేసుకొచ్చిన లోకేశ్ ఈ కేసులో బాధపడడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఓ మహిళా మున్సిపల్ కమిషనర్ ను అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.