చైనా యాప్ లను నిషేధించడాన్ని స్వాగతించిన పేటీఎం వ్యవస్థాపకుడు

  • 59 చైనా యాప్ లను నిషేధించిన కేంద్రం
  • సాహసోపేతమైన చర్యగా పేర్కొన్న పేటీఎం చీఫ్
  • కొత్త ఆవిష్కరణలకు ఇదే సమయం అని వెల్లడి
భారత్ లో 59 చైనా యాప్ లపై నిషేధం విధించడం తెలిసిందే. వాటిలో టిక్ టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హలో యాప్ వంటి ప్రజాదరణ పొందిన యాప్ లు కూడా ఉన్నాయి. ఈ పరిణామంపై పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్న యాప్ లను నిషేధించడం ఓ సాహసోపేతమైన చర్య అని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల రీత్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడంలో ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాల్సిన తరుణం ఇదేనని ట్వీట్ చేశారు.

ఓ భారతీయుడిగా విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యలు సరైనవే. అయితే, పేటీఎం యాప్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లో చైనా సంస్థలకు వాటాలున్నాయి. చైనా దిగ్గజ కంపెనీలు ఆలీబాబా, యాంట్ ఫైనాన్స్ సంస్థలు వన్97 కమ్యూనికేషన్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. తన సంస్థలో చైనా భాగస్వామ్యం ఉన్నా కానీ, విజయ్ శేఖర్ శర్మ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

కాగా, తమిళనాడు ఎంపీ మణిక ఠాగూర్ చైనా యాప్ లను కేంద్రం నిషేధించిన నేపథ్యంలో వ్యాఖ్యానిస్తూ, పేటీఎం యాప్ ను కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. పేటీఎంలో చైనా పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు.


More Telugu News