టిక్ టాక్ పై నిషేధం... మూగబోయిన సెలబ్రిటీల ఖాతాలు!

  • టిక్ టాక్ ను నిషేధించిన కేంద్రం
  • ఎంతో మంది సెలబ్రిటీలు వాడుతున్న యాప్
  • కొన్ని ప్రభుత్వ సంస్థల ఖాతాలు కూడా
భారత సార్వభౌమత్వానికి, గోప్యతకు విఘాతంగా మారాయన్న కారణంతో టిక్ టాక్, షేరిట్ వంటి అత్యంత పాప్యులర్ యాప్స్ సహా మొత్తం 59 చైనా యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో సెలబ్రిటీల ఖాతాలన్నీ మూగబోయాయి. సెలబ్రిటీలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్నో ఖాతాల్లో ఇకపై ఎటువంటి అప్ డేట్స్ వెలువడవు.

ఒకప్పుడు టిక్ టాక్ యాప్ ఇండియాలో అంత ప్రాచుర్యంలో లేదు. అయితే, క్రమంగా వీడియోల సంఖ్య పెరుగుతూ ఉండటం, దీన్ని వాడుతున్నవారు దానికి బానిసలుగా మారుతుండటంతో, యాప్ కు పాప్యులారిటీ పెరిగింది. బాలీవుడ్ తారలు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, షాహిద్ కపూర్, మాధురీ దీక్షిత్ వంటి వారు ఎందరో ఖాతాలు ఓపెన్ చేయగా, వారి వెనుక లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. ఇక టైగర్ షరాఫ్, దిశా పటానీ, కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ వంటి వారికైతే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. తమ ఫ్యాన్స్ తో నిత్యమూ టచ్ లో ఉండటానికి సోషల్ మీడియా యాప్స్ తో పాటు టిక్ టాక్ ను కూడా సెలబ్రిటీలు వినియోగిస్తున్నారు.

ఒక్క సెలబ్రిటీలు మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం 'మై గౌ ఇండియా' యాప్ కోసం టిక్ టాక్ ఖాతాను తెరచింది. కర్ణాటక ప్రభుత్వం, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబయి, మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ విభాగం, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ ఏజన్సీలు టిక్ టాక్ ద్వారా అప్ డేట్స్ ఇస్తున్నాయి. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు అందించే అధికారిక న్యూస్ ఏజన్సీ పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) సైతం ఓ ఖాతాను కలిగివుంది. భారత రైల్వేలకు కూడా ఎకౌంట్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు తమతమ ఖాతాలను డిలీట్ చేసుకుంటున్నాయి.


More Telugu News