డొక్కా మాణిక్య వరప్రసాద్ కు సర్టిఫికెట్ అందించిన రిటర్నింగ్ అధికారి... మండలిలో పెరిగిన వైసీపీ బలం
- ఇటీవల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు
- వైసీపీ తరఫున నామినేషన్ వేసిన డొక్కా
- మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవం
ఇటీవల ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఓ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నిక నిర్వహించారు. ఈసారి డొక్కా వైసీపీ తరఫున బరిలో దిగగా, నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తాజాగా, ఆ ఎన్నికలో విజయం సాధించినట్టు రిటర్నింగ్ అధికారి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు సర్టిఫికెట్ అందజేశారు. దాంతో శాసనమండలిలో వైసీపీ బలం పెరిగింది. ఇప్పటివరకు 9 మంది ఎమ్మెల్సీలు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య డొక్కాతో కలుపుకుని 10కి పెరిగింది.