ప్రైవేటు టీచర్లు రోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం బాధాకరం: పవన్ కల్యాణ్

  • కరోనా వ్యాప్తితో మూతపడిన విద్యాసంస్థలు
  • జీతాల్లేక అల్లాడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల బోధనా సిబ్బంది
  • ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ విజ్ఞప్తి
కరోనా రక్కసి ధాటికి సకలం నిలిచిపోయిన నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బోధనా సిబ్బంది పరిస్థితి కొన్నిచోట్ల దారుణంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది ప్రైవేటు ఉపాధ్యాయులు లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై టిఫిన్ బండ్లు, కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ దయనీయంగా కనిపించారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఓనమాలు నేర్పే గురువులు రోడ్డునపడడం బాధాకరమని పేర్కొన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు కొందరు జీతాలు లేక రోడ్డుపై కూరగాయలు, పండ్ల విక్రేతలుగా మారిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిందని పవన్ వెల్లడించారు. చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందేనని, కానీ ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో పాతుకుపోయిన కార్పొరేట్ విద్యాసంస్థలు తమ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. విద్యాసంస్థలు స్టూడెంట్ల నుంచి ఏడాది ఫీజు వసూలు చేసినా, కరోనా పేరుతో నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో బోధన వృత్తి నుంచి తప్పుకుని రోజు కూలీలుగా, తోపుడు బండ్లపై విక్రేతలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నవారిని కూడా ప్రభుత్వం గుర్తించి, తక్షణమే వారికి ఆర్థికసాయం అందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. బతకలేక బడిపంతులు అనే గతకాలపు మాటను వర్తమానంలో నిజం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, విద్యాసంస్థల యాజమాన్యాలపైనా ఉందని హితవు పలికారు.


More Telugu News