హైదరాబాదులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.. రేపటి నుంచి మళ్లీ కొవిడ్ టెస్టులు: ఈటల రాజేందర్

  • నగరంలో మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది
  • గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ప్రభావం ఉంది
  • సరైన చికిత్స అందించడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
హైదరాబాదులో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని... పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నగరంలో మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కరోనా ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు. రేపటి నుంచి మళ్లీ కొవిడ్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు.

కరోనా పేషెంట్లకు సరైన చికిత్స అందించడం లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... అందులో వాస్తవం లేదని ఈటల అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న 258 మంది వైద్య సిబ్బందికి కూడా పాజిటివ్ వచ్చిందని... హెడ్ నర్స్ ఒకరు ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, బెడ్ల కొరత లేదని... మరో వారం రోజుల్లో అదనంగా 10 వేల బెడ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.


More Telugu News