తెలంగాణలో పలుచోట్ల స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తోన్న వ్యాపారులు

  • ఎర్రగడ్డ రైతు బజార్‌లో నేటి నుంచి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌
  • అల్వాల్‌లో నేటి నుంచి వచ్చేనెల 6 వరకు లాక్‌డౌన్
  • అనేక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు
  • పలు జిల్లాల్లో వ్యాపారులతో కలిసి ప్రజా ప్రతినిధుల జేఏసీ
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో పలు ప్రాంతాల్లో వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డ రైతు బజార్‌లో నేటి నుంచి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. బేగంబజార్‌లో ఇటీవల 20 మందికి పైగా కరోనా సోకడంతో ఇప్పటికే అక్కడ వ్యాపారాలు నిలిచిపోయాయి.

ఇక అల్వాల్‌లో నేటి నుంచి వచ్చేనెల 6 వరకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించనున్నారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని వ్యాపారులు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతేకాదు, కరోనా ఉద్ధృతంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచే బంద్ పాటిస్తున్నారు.

ఈ మేరకు పలు జిల్లాల వ్యాపార సంఘాలు తీర్మానాలు చేస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో వ్యాపారులతో కలిసి ప్రజా ప్రతినిధులు జేఏసీలుగా ఏర్పడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్‌లోని చింతపల్లి‌లో రెండు రోజులుగా సంపూర్ణ బంద్‌ పాటిస్తున్నారు.

పీఏ పల్లిలో నేటి నుంచి కొన్ని రోజుల పాటు దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మిర్యాలగూడలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచుతామని వ్యాపారులు తెలిపారు. ఇక వరంగల్‌లో బీట్‌ బజార్‌, జేపీఎన్‌రోడ్‌ వంటి కీలక ప్రాంతాల్లో దుకాణాలను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకే మూసివేస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లోనూ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. మక్తల్‌లో మధ్యాహ్నం సమయానికే  దుకాణాలు మూసేస్తున్నారు. పెద్దపల్లి, జనగామ, నిజామాబాద్‌లోనూ స్వచ్ఛందంగా వ్యాపారులు నిర్ణయాలు తీసుకుని సాయంత్రానికే దుకాణాలు మూసేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో దుకాణాలు సాయంత్రం 6 గంటలలోపే బంద్‌ చేస్తున్నారు.

తెలంగాణలో మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో పలు రాష్ట్రాల్లో మరోసారి లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వాలు భావిస్తోన్న విషయం తెలిసిందే. వానాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశాలు కూడా ఉండడంతో మరింత ప్రమాదం ఉండడంతో జీహెచ్‌ఎంసీలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా భావిస్తోంది.


More Telugu News