అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో... ట్వీట్ ను డిలీట్ చేసిన ట్రంప్!

  • 'వైట్ పవర్' ఉండాలంటూ వ్యక్తి నినాదాలు
  • వీడియో షేర్ చేసిన ట్రంప్
  • మూడున్నర గంటల తరువాత డిలీట్
ట్రంప్ మద్దతుదారుడు ఒకరు 'శ్వేతజాతీయుల శక్తి' (వైట్ పవర్) ఉండాల్సిందేనంటూ నినాదాలు చేస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్రంప్, అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో దాన్ని డిలీట్ చేశారు. "గ్రామాల్లోని గొప్ప ప్రజలకు కృతజ్ఞతలు. వామపక్ష భావాలున్న డెమోక్రాట్లు ఇక ఓడిపోవాల్సిందే" అనే కామెంట్ తో ఆయన ఈ వీడియోను షేర్ చేసుకున్నారు.

ఈ వీడియో కాసేపటికే వైరల్ అయింది. ఆ వెంటనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోను ఫ్లోరిడాలో తీసినట్టు తెలుస్తోంది. ఓ వ్యక్తి 'ట్రంప్ 2020', 'అమెరికా ఫస్ట్' అని రాసున్న ప్లకార్డులు పట్టుకుని, తెల్లజాతివారిదే అమెరికా అన్నట్టు నినాదాలు చేశాడు. రోడ్డుపక్కన ఉన్న ఓ నల్లజాతి వ్యక్తిని చూస్తూ, "శ్వేతజాతీయుల శక్తి... వింటున్నావా? శ్వేతజాతీయుల శక్తి" అంటూ కేకలు పెట్టాడు. ఈ వీడియోతో కూడిన ట్వీట్ ను ఉదయం 7.30 గంటల సమయంలో పెట్టిన ట్రంప్, ఆపై 11 గంటల సమయంలో తీసేశారు.

ట్రంప్, అమెరికాలో జాతి విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవలి జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తరువాతైనా ఆయన మారలేదని పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీంతోనే ట్రంప్ ఓ మెట్టు దిగి తన ట్వీట్ ను డిలీట్ చేశారని తెలుస్తోంది.


More Telugu News