కరోనా భయంతో అందరూ వెనుకంజ వేసినా... మానవత్వం చాటిన ఓ మహిళా పోలీసు 

  • వెంకటలక్ష్మికి రక్తదానం చేసిన హెడ్ కానిస్టేబుల్ స్వాతి
  • ప్రసవం వేళ వెంకటలక్ష్మికి ఎమర్జెన్సీ
  • రక్తదానం చేసిన స్వాతికి అభినందనల వెల్లువ
కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ రోజుల్లో మానవ సంబంధాలు ప్రశ్నార్థకమవుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనూ ఓ మహిళా పోలీసు మానవతా దృక్పథంతో వ్యవహరించిన ఉదంతం మచిలీపట్నంలో చోటుచేసుకుంది. బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటలక్ష్మి అనే మహిళకు కాన్పు సందర్భంగా అత్యవసరంగా రక్తం అవసరమైంది. అయితే కరోనా భయంతో రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వైద్యుల్లో ఆందోళన నెలకొంది.

ఈ విషయం తెలిసిన మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న స్వాతి వెంటనే స్పందించారు. వెంకటలక్ష్మిది బి పాజిటివ్ గ్రూపు కాగా తనదీ అదే గ్రూపు కావడంతో రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. సకాలంలో రక్తం అందడంతో వెంకటలక్ష్మి ప్రసవం సాఫీగా సాగింది. దాంతో హెడ్ కానిస్టేబుల్ స్వాతిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా తమ ఉద్యోగిని స్వాతిని మనస్ఫూర్తిగా ప్రశంసించారు.



More Telugu News