వైసీపీ నేతను ఫోనులో బెదిరించిన టీడీపీ నేత.. వివరణ ఇచ్చిన కూన రవికుమార్!

  • పొందూరు  వైసీపీ నేత బిల్డింగ్ లో ఉన్న టీడీపీ కార్యాలయం
  • ఆఫీసును ఖాళీ చేయాలని కూనకు బిల్డింగ్ ఓనర్ ఫోన్
  • ఖాళీ చేసే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చిన కూన
శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కూన రవికుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తేడా వస్తే లేపేస్తానంటూ వైసీపీ నేత మోహన్ ను ఆయన బెదిరించారు. పొందూరు మండలానికి చెందిన మోహన్ గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. అయితే పొందూరులోని మోహన్ బిల్డింగ్ లోనే టీడీపీ కార్యాలయం ఉంది. వైసీపీ నేతల నుంచి ఒత్తిడి వస్తుండటంతో... టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ కూనకు ఆయన ఫోన్ చేశారు.

మోహన్ కాల్ పట్ల కూన దురుసుగా ప్రవర్తించారు. ఆఫీసును ఖాళీ చేసే ప్రసక్తే లేదని... ఏం చేసుకుంటావో చేసుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన బిల్డింగ్ ను ఖాళీ చేయాల్సిందేనని మోహన్ అన్నారు. దీంతో మర్యాదగా ఉండకపోతే మర్యాద తప్పాల్సి వస్తుందని కూన హెచ్చరించారు. తేడా వస్తే లేపేస్తానంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

దీనిపై రవికుమార్ స్పందించారు. 2012లో ఆయనతో కలిసి తాను ఈ బిల్డింగ్ ను కొనుగోలు చేశానని చెప్పారు. 2009 నుంచి అదే బిల్డింగ్ లో తాను రెంట్ కు ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత పార్టీ ఆఫీసు కోసం దాన్ని కొన్నామని... ఇద్దరం జాయింట్ గా కొన్నామని చెప్పారు. అయితే, రిజిస్ట్రేషన్ సమయంలో తాను అక్కడ లేకపోవడంతో... గుడ్ల మోహన్ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యంతో ఆయన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయమని చెప్పానని అన్నారు. టీడీపీలోనే నమ్మకమైన కార్యకర్తగా ఉండటం వల్ల అతనిపై నమ్మకం ఉండేదని చెప్పారు.

పార్టీ మారిన తర్వాత... ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాం అతనిపై ఒత్తిడి చేశారని కూన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీసుకు వైట్ కలర్ వేయించాడని చెప్పారు. బిల్డింగ్ ఖాళీ చేయించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయనే తనతో నేరుగా చెప్పారని అన్నారు. తన వాయిస్ ను రికార్డ్ చేయాలనే ఉద్దేశంతోనే ఫోన్ లో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని చెప్పారు.

సదరు బిల్డింగ్ లో ఇద్దరికి చెరిసగం వాటా ఉందంటూ మోహనే చాలా సార్లు చెప్పారని తెలిపారు. ఆయనపై ఒత్తిడి తెచ్చింది ఎవరో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. తాను వేరే ప్రాంతంలో ఉన్నానని... వచ్చిన తర్వాత అన్ని ఆధారాలు చూపిస్తానని చెప్పారు. ఫోన్ లో తాను తప్పేమీ మాట్లాడలేదని... మీరు మర్యాదగా మాట్లాడితే, తాను కూడా మర్యాదగా మాట్లాడతానని అన్నానని తెలిపారు. తమ్మినేని సీతారాం దిగజారిన వ్యక్తి అని, ఫ్రాడ్ ఫెలో అని  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


More Telugu News