గురుగ్రామ్ నుంచి ఢిల్లీ వైపు కదిలిన మిడతలు... అప్రమత్తమైన అధికారులు
- గురుగ్రామ్ పై మిడతల దండయాత్ర
- ఐటీ కంపెనీల్లో చొరబడిన రాకాసి మిడతలు
- ఢిల్లీ విమానాశ్రయంలో పైలెట్లకు సూచనలు
దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతం గురుగ్రామ్ పై రాకాసి మిడతలు దండెత్తాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మిడతల దండు గురుగ్రామ్ లోని ఐటీ కంపెనీలు, ఇతర కార్యాలయాల్లో చొరబడ్డాయి. మెట్రో స్టేషన్లలోనూ మిడతలు పెద్ద ఎత్తున ప్రవేశించాయి. ఆకాశం నుంచి ఊడిపడ్డాయా అన్నట్టుగా వచ్చిన వీటిని చూసి గురుగ్రామ్ వాసులు హడలిపోతున్నారు. మరోపక్క, అధికారులు రాజధాని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇళ్ల తలుపులు, కిటికీలు మూసివేయాలని, పెద్దగా చప్పుడు చేయాలని సూచించారు. ఇవి క్రమంగా ఢిల్లీ వైపు పయనిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ముందుజాగ్రత్తగా, ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు పైలెట్లకు మిడతల కదలికలపై అవగాహన కల్పించారు.