కాపులకు చంద్రబాబు చేసిన మోసం పవన్ కు కనబడలేదా?: మంత్రి కన్నబాబు ఫైర్

  • కాపు నేస్తంపై ఇటీవల పవన్ వ్యాఖ్యలు
  • చంద్రబాబుపై పవన్ ప్రేమను దాచుకోలేకపోతున్నారు 
  • పవన్ దుష్ప్రచారం చేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం
రిజర్వేషన్ డిమాండ్ నుంచి కాపుల దృష్టి మరల్చేందుకే నిధుల విడుదల అంటూ మభ్యపెడుతున్నారని జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీ సర్కారుపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు బదులిచ్చారు. జగన్ అంటే నచ్చదు కాబట్టే పవన్ అలాంటి విమర్శలు చేస్తుంటారని వ్యాఖ్యానించారు. పవన్ తన ప్రెస్ నోట్ లో జగన్ రెడ్డి అని రాస్తుంటారని, కులం దాచిపెడితే దాగేది కాదని ఎద్దేవా చేస్తుంటారని,  ఇది సరైన పద్ధతి కాదని కన్నబాబు హితవు పలికారు. ఓటు రూపంలో ప్రజలు దీవించారని, అన్ని వర్గాలను సమభావంతో చూస్తుంటే, పవన్ కల్యాణ్ ఏం కోరుకుని ఈ విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదని అన్నారు.

చంద్రబాబు పట్ల ప్రేమను పవన్ దాచుకోలేకపోతున్నారని, నాడు ముద్రగడను పచ్చిబూతులు తిట్టినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని కన్నబాబు ప్రశ్నించారు. కాపులకు చంద్రబాబు చేసిన మోసం పవన్ కు కనబడలేదా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ కళ్లకు చంద్రబాబు ఓ ప్రపంచ సంస్కర్తగా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. కాపు నేస్తం పథకం కింద ఏటా మహిళలకు రూ.15 వేలు ఇస్తున్నామని, కాపుల కోసం సంవత్సరానికి రూ.4,769 కోట్లు ఖర్చు చేస్తున్నామని కన్నబాబు వివరించారు.

కానీ పవన్ కల్యాణ్ కాపు నేస్తం పథకంపై చెడుగా ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కు ఎందుకింత ఉక్రోషమో అర్థం కావడం లేదని, కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయలేకపోతున్నారని విమర్శించారు.


More Telugu News