ఫేస్‌బుక్‌కు యాడ్స్‌ నిలిపేసిన సంస్థలు.. భారీగా నష్టపోతోన్న కంపెనీ

  • వివాదాస్పద మెసేజ్‌లను కట్టడి చేయట్లేదని విమర్శలు
  • యాడ్స్‌ నిలిపేసిన దిగ్గజ కంపెనీలు
  • నిన్న రూ. 53 వేల కోట్ల సంపద ఆవిరి
  • సరిదిద్దుకుంటామని జుకర్‌బర్గ్‌ ప్రకటన
ఫేస్‌బుక్‌కు యాడ్స్‌ నిలిపేస్తూ పలు దిగ్గజ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. వివాదాస్పద మెసేజ్‌లను కట్టడి చేయడంలో ఫేస్‌బుక్‌ సరైన రీతిలో స్పందించట్లేదని యూనిలీవర్‌, వెరిజాన్‌,  కోకకోలా, హోండా మోటార్‌, హెర్షీ కో వంటి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఫేస్‌బుక్‌కు అతి భారీగా నష్టం వస్తోంది.

ఫేస్‌బుక్‌కు నెల రోజుల పాటు ప్రకటనలు ఇవ్వడం నిలిపేస్తున్నట్లు‌ ఇప్పటికే కోకకోలా ప్రకటన చేసింది. యూనిలీవర్‌, వెరిజాన్, మోటార్‌, హెర్షీ కో కంపెనీలు కూడా అదే నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు, పలు సంస్థలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

విద్వేష పూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ సరిగ్గా కట్టడి చేయట్లేదని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఫేస్‌బుక్‌పై అమెరికాలో ఇటీవల విమర్శలు అధికమయ్యాయి. పలు కంపెనీలు ప్రకటనలు నిలిపివేయడంతో ఫేస్‌బుక్ షేరు నిన్న 8.5 శాతం పడిపోయింది. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్‌బుక్ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది.

అమెరికాలోని డిజిటల్‌ ప్రకటనల మార్కెట్‌లో ఫేస్‌బుక్ సంస్థకు దాదాపు 23 శాతం వాటా ఉంది. ఫేస్‌బుక్ కు మూడు  బిలియన్లమంది యూజర్లు ఉన్నారు. గత ఏడాది ఆ సంస్థ డిజిటల్‌ యాడ్స్‌ ఆదాయం 27 శాతం పెరిగి సుమారు 70 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఈ సారి మాత్రం ఆ సంస్థకు యాడ్స్‌ ఇచ్చే కంపెనీలు కఠిన నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్ పై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ... అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని తెలిపారు. విద్వేషపూరిత వ్యాఖ్యలపై మరింత కఠినంగా వ్యవహరించనున్నామని, రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు.


More Telugu News