అన్‌లాక్-2కు రంగం సిద్ధం.. పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు!

  • విద్యాసంస్థలు, మెట్రోలు బంద్
  • అంతర్జాతీయ విమాన సర్వీసులు జులై 15 వరకు బంద్
  • రెగ్యులర్ రైళ్లను పునరుద్ధరించే అవకాశం లేదన్న రైల్వే బోర్డు
ఈ నెల 30తో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే, ప్రస్తుత అన్‌లాక్-1తో పోలిస్తే అన్‌లాక్-2లో పెద్దగా మార్పులేవీ ఉండవని సమాచారం. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను వచ్చే నెల 15 వరకు రద్దు చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించగా, రైల్వే బోర్డు కూడా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకుంది. సమీప భవిష్యత్తులో రెగ్యులర్ రైళ్లను నడపడం సాధ్యం కాదని రైల్వే బోర్డు అభిప్రాయపడింది.

మరోవైపు, ఆగస్టు మధ్య వరకు విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ స్పష్టం చేశారు. ఐఐటీ బాంబే సహా సాధారణ స్కూళ్ల వరకు అన్ని యాజమాన్యాలు ఆన్‌లైన్‌ క్లాసుల కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు, పలు రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. వచ్చే నెలలో జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో సర్వీసులను కూడా ఇప్పుడప్పుడే ప్రారంభించడం సురక్షితం కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్‌లాక్-1తో పోలిస్తే అన్‌లాక్-2లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.


More Telugu News