అంత పెద్దాయన నాపై పగబట్టడం నా దురదృష్టం: రఘురామకృష్ణంరాజు

  • రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ నోటీసులు
  • ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలిసిన ఎంపీ
  • పార్టీతో తనకు ఎలాంటి వివాదం లేదని స్పష్టీకరణ
గత కొన్నిరోజులుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు, వైసీపీ అధినాయకత్వానికి మధ్య దూరం మరింత పెరిగింది. తన నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలతో రఘురామకృష్ణంరాజు కయ్యానికి కాలుదువ్వడం వైసీపీ హైకమాండ్ ను ఆగ్రహానికి గురిచేసింది. దాంతో ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులు పంపారు. దీనిపై ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలిసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పార్టీతో తనకు ఎలాంటి వివాదం లేదని, కానీ విజయసాయిరెడ్డి తనను ఎందుకు ఓ బూచోడ్ని చూసినట్టు చూస్తున్నారో అర్థం కావడంలేదని వాపోయారు. ఇద్దరం ఎంపీలం కావడంతో ఆయనకో కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆ తర్వాత తనకూ ఓ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని వెల్లడించారు. ఆయనకు ఎన్నో పదవులు ఉన్నాయని, తనకు ఈ కమిటీ చైర్మన్ పదవి తప్ప మరే పదవీ లేదని స్పష్టం చేశారు.

"విజయసాయిరెడ్డి ప్రతి రోజూ ముఖ్యమంత్రితో గంటలకొద్దీ గడుపుతారు, మాకు మూడ్నెల్లకోసారి కూడా సీఎం దర్శనం దొరకదు. విజయసాయిరెడ్డి పార్టీలో ఎంతో పెద్ద వ్యక్తి. పార్టీకి జనరల్ సెక్రటరీ కూడా. నా విషయానికొస్తే నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చారో లేదో కూడా తెలియదు. అంత చిన్నవాడ్ని నేను. చిన్నవాడితో అంత పెద్దాయనకు వివాదమేంటో తెలియదు. నాపై అంత పెద్దాయన పగబట్టడం నా దురదృష్టం అనుకుంటున్నా. మాది కలతల కాపురం అని భావిస్తున్నా. ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచిస్తున్నా" అంటూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.


More Telugu News