కాపులు రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా చేసే ఎత్తుగడలా ఉంది: కాపు నిధులపై పవన్ వ్యాఖ్యలు

  • 'కాపు' నిధులు ఇప్పటివరకు ఎంతిచ్చారన్న పవన్
  • శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
  • ప్రస్తుత ప్రభుత్వం గొప్పలు చెబుతోందంటూ వ్యాఖ్యలు
కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపులకు వేల కోట్ల నిధులు ఇస్తామని ప్రగల్భాలు పలకడం తప్ప, ఎంత ఇచ్చారో స్పష్టత లేదని విమర్శించారు. అసలు ఇప్పటివరకు కాపు కార్పొరేషన్ కు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారో శ్వేత పత్రంలో వెల్లడించాలని తెలిపారు. ఆకలితో ఏడ్చే పిల్లాడికి చేతిలో గోలీ పెట్టి బుజ్జగించాలని చూశాడట వెనకటికి ఓ ఆసామి! ఏపీలో కాపుల కార్పొరేషన్ కూడా ఆ విధంగా ఏర్పాటైందేనంటూ పవన్ వ్యాఖ్యానించారు.

"వెనుకబడిన జాతికి రిజర్వేషన్లు కోరుతూ చేస్తున్న ఆందోళనల నుంచి కాపుల దృష్టి మరల్చేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా కాపుల దృష్టిని ఏమార్చారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరిన్ని తెలివితేటలతో ఏ పథకం కింద లబ్ది చేకూర్చినా, అది కాపులను ఉద్ధరించడానికే అని గొప్పలు పోతోంది.

అప్పటి సర్కారు కాపు కార్పొరేషన్ కు ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని ప్రకటిస్తే, వైసీపీ సర్కారు ఓ అడుగు ముందుకేసి రూ.2 వేల కోట్లు ప్రకటించింది. గత 13 నెలల కాలంలో కాపుల కోసం రూ.4,770 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ అంటున్నారు. ఈ నిధులను రాష్ట్రంలో అందరితో కలిపి ఇచ్చారా, లేక ప్రత్యేకంగా కాపులకే ఇచ్చారా అనేది వైసీపీ ప్రభుత్వ పెద్దలు స్పష్టంగా ప్రకటించడంలేదు. కాపులు రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా చేసే ఎత్తుగడగా దీన్ని మా పార్టీ భావిస్తోంది. అందుకే కాపులకు ఇస్తున్న నిధులతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాం" అంటూ పవన్ స్పష్టం చేశారు.


More Telugu News