జూలై 1 నుంచి రద్దు చేసిన రైళ్ల విషయంలో రిఫండ్ ప్రక్రియ వివరాల విడుదల!

  • జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకూ ప్యాసింజర్ రైళ్లు రద్దు
  • టికెట్ కౌంటర్ల నుంచి కొన్న టికెట్లకు ఆరు నెలల వరకూ రద్దు అవకాశం
  • ఆన్ లైన్ టికెట్లకు ఆటోమేటిక్ గా డబ్బు వాపస్
జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకూ అన్ని ప్యాసింజర్ రైళ్లనూ రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం ప్రత్యేక రైళ్లు మాత్రమే తిరుగుతాయని, అన్ని సాధారణ రైళ్లనూ రద్దు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఇక టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి డబ్బును వెనక్కు ఇస్తామని చెప్పిన ఇండియన్ రైల్వేస్, రిఫండ్ రూల్స్ ను విడుదల చేసింది.

ఇందులో భాగంగా, రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్లను కొనుగోలు చేసిన వారు, ఆరు నెలలలోగా రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకుని పొందవచ్చని, ఇందుకోసం టీడీఆర్ (టికెట్ డిపాజిట్ రిసిప్ట్)ను టికెట్ కౌంటర్ లో అందించాల్సి వుంటుందని పేర్కొంది. ఇక ఆన్ లైన్ మాధ్యమంగా టికెట్లను బుక్ చేసిన వారి బ్యాంకు ఖాతాల్లో ఆటోమేటిక్ గా డబ్బు జమ అవుతుందని వెల్లడించింది.

ప్రయాణికులు పీఆర్ఎస్ కౌంటర్ టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా కూడా రద్దు చేసుకుని రిఫండ్స్ పొందవచ్చని, 139కు కాల్ చేసి కూడా టికెట్లు క్యాన్సిల్ చేయవచ్చని తెలిపింది. జూలై 1 నుంచి ఆగస్టు 12 మధ్య ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకుని, ఇప్పటికే క్యాన్సిల్ చేసుకున్న వారికి తగ్గించిన క్యాన్సిలేషన్ చార్జీలను తిరిగి ఇస్తామని, ఇందుకోసం మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

క్యాన్సిల్ చేసిన రైళ్ల వివరాలన్నీ ఐసీఎంసీలో అప్ డేట్ చేశామని, సీఆర్ఐఎస్, ఐఆర్సీటీసీ రిఫండ్స్ ప్రాసెస్ సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలనూ తీసుకుందని అధికారులు వెల్లడించారు.


More Telugu News