అమెరికాను మళ్లీ వణికిస్తున్న కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 34,700 కేసుల నమోదు

  • మళ్లీ గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్న కేసులు
  • టెక్సాస్‌లో రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు
  • అక్టోబరు నాటికి 1.80 లక్షల మంది చనిపోతారని అంచనా
అమెరికాలో రెండు నెలలపాటు కాస్త తగ్గుముఖం పట్టినట్టు అనిపించిన కరోనా వైరస్ మళ్లీ చెలరేగిపోతోంది. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో ఏకంగా 34,700 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఒకే రోజులో 36,400 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత ఇదే గరిష్ఠం.

నిన్నమొన్నటి వరకు న్యూయార్క్‌, న్యూజెర్సీలను వణికించిన వైరస్ అక్కడ తగ్గుముఖం పట్టగా తాజాగా, అరిజోనా, కాలిఫోర్నియా, మిస్సిస్సిపి, నెవడా, టెక్సాస్, ఓక్లహామా తదితర నగరాల్లో ప్రతాపం చూపిస్తోంది. టెక్సాస్‌లో రెండు వారాల్లోనే కేసులు మూడు రెట్లు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. హ్యూస్టన్‌లో అయితే ఐసీయూలు మొత్తం నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.

అమెరికాలో ఇప్పటి వరకు 1.20 లక్షల మందికిపైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు. కాగా, అమెరికాలో మరణాల సంఖ్య అక్టోబరు నాటికి 1.80 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ అంచనా వేసింది.


More Telugu News