మే ఆరంభం నుంచి చైనా బలగాల తీరు ఇలాగే ఉంది: భారత్

  • 1993 నాటి ఒప్పందాన్ని చైనా గౌరవించడంలేదన్న విదేశాంగ శాఖ
  • భారీగా బలగాలను మోహరిస్తోందని వెల్లడి
  • అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపణ
సరిహద్దుల్లో చైనా బలగాల వైఖరిపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. గతంలో సందర్భాలకు అనుగుణంగా వెనక్కి తగ్గినప్పటికీ, ఈ ఏడాది చైనా దళాల వ్యవహార శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ విమర్శించింది. మే ఆరంభం నుంచి చైనా బలగాలు పరస్పర ఒప్పందాలను గౌరవించిన దాఖలాలు లేవని ఆరోపించింది. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా గత నెల నుంచి పెద్ద ఎత్తున బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరించడం ప్రారంభించిందని పేర్కొంది.

భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద సామరస్యపూర్వకంగా ఉండాలన్నది 1993 నాటి ఒప్పందంలోని అంతస్సూత్రమని, కానీ చైనా ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అందుకు వ్యతిరేకం అని విదేశాంగ శాఖ తెలిపింది. నియంత్రణ రేఖ వద్ద తమ అధీనంలోని భూభాగంలో పరిమిత సంఖ్యలో సైనిక బలగాలను మోహరించాలన్నది ఒప్పందంలో ఓ నిబంధన కాగా, చైనా అన్నింటినీ ఉల్లంఘిస్తూ భారీగా బలగాలను మోహరిస్తోందని ఆరోపించింది.


More Telugu News