ఆగస్టు 12 వరకు సాధారణ రైళ్లు అన్నీ నిలిపివేత... కరోనా వ్యాప్తితో రైల్వే బోర్డు కీలక నిర్ణయం
- దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం
- ఇప్పటికే బుక్ అయిన టికెట్లన్నీ క్యాన్సిల్
- పూర్తి నగదు తిరిగి చెల్లించనున్న రైల్వే శాఖ
దేశంలో కరోనా రక్కసి విజృంభణ నానాటికీ అధికమవుతుండడంతో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు అన్ని రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, మెయిల్ సర్వీసులు, ప్యాసింజరు రైళ్లు, సబర్బన్ రైళ్లను ఆగస్టు 12 వరకు నిలిపివేస్తున్నట్టు రైల్వే బోర్డు వెల్లడించింది. అయితే, లాక్ డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లు మాత్రం నడుస్తాయని స్పష్టం చేసింది. రైల్వే బోర్డు తాజా ప్రకటనను అనుసరించి జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు బుకింగ్ చేసుకున్న టికెట్లన్నీ రద్దయిపోతాయి. ప్రయాణికులకు రైల్వే శాఖ పూర్తి నగదు తిరిగి చెల్లిస్తుంది.