వర్క్ ఫ్రమ్ హోమ్ తో విసిగిపోయారా? ఇది చదవాల్సిందే!

  • కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే పని చేసుకుంటున్న ఉద్యోగులు
  • దీన్ని అవకాశంగా మలుచుకుంటున్న రిసార్టులు
  • అన్ని సదుపాయాలతో ప్రొఫెషనల్స్ ను ఆకట్టుకుంటున్న వర్కేషన్స్
కరోనా మహమ్మారి మనుషుల లైఫ్ ని, లైఫ్ స్టైల్ ని మార్చేసింది. ఇంటి నుంచి బయటకు కదలడం కూడా ప్రమాదకరంగా మారిన వేళ... ఎంతో మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోం చేయడానికి తమ ఉద్యోగులకు అనేక కంపెనీలు అనుమతించాయి. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు కొంత మేర సడలించినప్పటికీ.. కార్యాలయాలకు పూర్తి సంఖ్యలో ఉద్యోగులు వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు, కరోనా కేసులు కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో... భయాందోళనలు పెరుగుతున్నాయి.

మరోవైపు, రోజుల తరబడి ఇంటి నుంచి పని చేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రొఫెషనల్స్ బోర్ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వారి కోసమే కర్ణాటకలోకి కూర్గ్ ప్రాంతంలో ఉన్న పార్క్యుపైన్ క్యాజిల్ అనే ఓ రిసార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'ఇంటి నుంచి పని చేస్తున్నారా? రిసార్టునే మీ ఇంటిగా ఎందుకు మలుచుకోరాదు?' అంటూ ఉద్యోగులను ఆకట్టుకుంటోంది. 'వర్కేషన్' పేరుతో 10 రోజుల ప్యాకేజీలను అందిస్తోంది. హెడ్ ఫోన్ మాత్రమే తెచ్చుకోండి... అంతరాయం లేని వైఫై, వర్క్ స్టేషన్, కావాల్సిన ఆహారం, అన్ని వసతులు, సదుపాయాలను మేము కల్పిస్తామని ఆహ్వానిస్తోంది.

ఈ సందర్భంగా సదరు రిసార్ట్ సేల్స్ డైరెక్టర్ అనీలా పాల్ మాట్లాడుతూ, ఇంట్లో నాలుగు గోడల మధ్య రోజుల తరబడి కూర్చొని పని చేయడం వల్ల జనాలు విసిగిపోయారని చెప్పారు. అలాంటి వారి కోసమే తాము వర్కేషన్ ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్ నుంచి కూడా తమకు ఫోన్లు వస్తున్నాయని... అయితే ప్రస్తుతానికి తాము బెంగళూరు ప్రజలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్ ఫ్రీ జోన్ల నుంచి వచ్చే వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. 250 ఎకరాల్లో తమ రిసార్ట్ ఉందని... ఇక్కడ ఉండే వారు ఆఫీస్ వర్క్ పూర్తైన తర్వాత సైక్లింగ్, ట్రెక్కింగ్, వాకింగ్ లాంటివి చేసుకోవచ్చని చెప్పారు.

పార్క్యుపైన్ క్యాజిల్ తరహాలోనే పలు చోట్ల పలు సంస్థలు ఇలాంటి సేవలనే అందుబాటులోకి తీసుకొచ్చాయి. బెంగళూరు, గోవా, కూర్గ్, చిక్ మగళూరు తదితర ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. బడ్జెట్ హోటల్స్ దగ్గర నుంచి ఖరీదైన రిసార్టుల వరకు ఈ సేవలను అందిస్తున్నాయి. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్, ఐటీసీ హోటల్స్ కూడా ఇవే సదుపాయాలతో వివిధ ప్యాకేజీలను అందిస్తున్నాయి. వీటికి ఆదరణ కూడా క్రమంగా పుంజుకుంటోంది.


More Telugu News