దేశంలో 56.70 శాతం రికవరీ రేటు.. సురక్షిత స్థానంలో భారత్!

  • రికవరీ విషయంలో నాలుగో స్థానంలో భారత్
  • 78 శాతం రికవరీ రేటుతో దేశంలో అగ్రస్థానంలో రాజస్థాన్
  • దేశంలో తీవ్రంగా ఉన్నవి 9 వేల కేసులు మాత్రమే
కరోనా వైరస్ విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ సురక్షిత స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 94 లక్షల కరోనా కేసులు నమోదు కాగా 50.65 లక్షల మంది కోలుకున్నారు. అంటే రికవరి రేటు 54 శాతంగా ఉందన్నమాట. అదే సమయంలో భారత్‌లో రికవరీ రేటు 56.70 శాతం నమోదైంది. అంటే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ సురక్షిత స్థానంలో ఉన్నట్టేనని, వైరస్ విషయంలో అతిగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అత్యధిక రికవరీ రేటుతో ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో ఉందని వివరించింది. ఇక మన దేశంలో చూస్తే 78 శాతం రికవరీ రేటుతో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది.

భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటినప్పటికీ వాటిలో 9 వేల కేసులు మాత్రమే తీవ్రంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. మిగిలిన వారందరికీ వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ లక్ష మందిలో ఆరుగురు కరోనా మహమ్మారికి బలవుతుంటే, భారత్‌లో ఆ సంఖ్య ఒక్కటి మాత్రమేనని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.58 లక్షల మంది కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు.


More Telugu News