ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎవరినైనా కలవొచ్చు.. తప్పేముంది?: విష్ణుకుమార్ రాజు

  • నిమ్మగడ్డను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అధికారిగా గుర్తిస్తోందా?
  • కేసులు ఉన్నవాళ్లు కూడా ఎవరెవరినో కలుస్తుంటారు
  • ఈ అంశాన్ని వైసీపీ ఎందుకు రాజకీయం చేస్తోంది
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీ కావడంపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలను బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఖండించారు. వారు కలుసుకున్నది పగలేకదా.. రాత్రి కాదు కదా అని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే... నిమ్మగడ్డను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అధికారిగా గుర్తిస్తోందా? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఎన్నికల అధికారి పదవిలో లేరని చెప్పుకునే ప్రభుత్వం... ఆయనను ఇతరులు కలవడాన్ని ఎందుకు రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు.

నిమ్మగడ్డ పదవిలో లేనప్పుడు ఆయనను ఎవరు కలిస్తే ఏంటని విష్ణు ప్రశ్నించారు. వీరు ముగ్గురు కలిస్తే అందులో మీకు ఏం కుట్ర కనిపిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరితోనైనా ఎవరైనా కలవొచ్చని చెప్పారు. కేసులు ఉన్నవాళ్లు కూడా ఎవరెవరినో కలుస్తుంటారని అన్నారు. ఇందులో ఏం తప్పు ఉందో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.


More Telugu News