కరోనాతో కన్నుమూసిన తృణమూల్ ఎమ్మెల్యే

  • మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తమోనాష్ ఘోష్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • చాలా దురదృష్టకరమన్న సీఎం మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్, కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఈ విషయాన్ని వెల్లడించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ "చాలా చాలా దురదృష్టకరం, ఫాల్టా నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1998 నుంచి పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న తమోనాష్ ఘోష్ మనల్ని వీడి వెళ్లిపోయారు" అని ట్వీట్ చేశారు. గత నెలలో ఆయనకు కరోనా సోకగా, అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.

తమోనాష్ ఘోష్, గత 35 సంవత్సరాలుగా మనతో కలిసి పనిచేశారని, పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన ఎంతో శ్రమించారని, ఎన్నో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని మమతా బెనర్జీ కొనియాడారు. ఆయన మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నానని, ఈ సమయంలో ఆయన భార్య ఝార్నా, బంధుమిత్రులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు.

కాగా, ప్రజా జీవితంలో ఉంటూ కరోనా బారిన పడి మరణించిన తమోనాష్ ఘోష్ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వెలిబుచ్చారు. ఇటీవల కరోనాతో తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జె.అన్బళగన్ కూడా మరణించిన సంగతి తెలిసిందే.


More Telugu News