దేశంలో ప్రతి లక్ష మందిలో ఒకరు కరోనాకు బలి!

  • ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువ
  •  బ్రిటన్‌లో అత్యధికంగా ప్రతి లక్ష మందికి 63.13 మంది బలి
  • దేశంలో 56.7 శాతంగా రికవరీ రేటు
భారత్‌లో ప్రతి లక్ష మందిలో ఒకరు కరోనా మహమ్మారితో మరణిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మిగతా దేశాలతో పోలిస్తే కరోనా కేసులు, మరణాల సంఖ్య తక్కువగానే ఉందని పేర్కొంది. సరైన సమయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్, నిరంత పర్యవేక్షణ కారణంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య అదుపులో ఉన్నట్టు తెలిపింది.

దేశంలో ఇప్పటి వరకు  2.58 లక్షల మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 56.7 శాతంగా ఉందని వివరించింది. కాగా, నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 15,968 మంది కరోనా బాధితులుగా మారగా, 465 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య  4,56,183కు పెరగ్గా 14,476  మృతి చెందారు. ఇక, జూన్ 2 నాటికి దేశంలోని ప్రతి లక్ష మందిలో 0.41 మంది కరోనాతో మరణించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు 4.9గా ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. బ్రిటన్‌లో ప్రతి లక్ష మందికి 63.13 మంది, స్పెయిన్‌లో 60.60, ఇటలీలో 57.19, అమెరికాలో 36.30, జర్మనీలో 27.32, బ్రెజిల్‌లో 23.68, రష్యాలో 5.62 మందిని కోవిడ్ బలితీసుకుంటోంది.


More Telugu News