భర్త పేరుతో రూ. 20 లక్షలకు బీమా.. ఆపై హత్య చేయించిన భార్య!

  • వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఘటన
  • భర్త చనిపోతే తర్వాతి జీవనం ఎలా ఆలోచనతో ముందుగానే బీమా
  • ఉరివేసినా ఇంకా ఊపిరి ఉందని బండరాయితో మోది హత్య
భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య అతడిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఆ తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచించిన ఆమె అద్భుతమైన ప్రణాళిక రచించింది. భర్త పేరుతో రూ. 20 లక్షలకు బీమా చేయించి ఆ తర్వాత పని పూర్తి చేసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని పర్వతగిరి మండలం హత్యా తండాకు చెందిన బాదావత్ వీరన్న.. భార్య యాకమ్మతో కలిసి పున్నేలు ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా పాఠశాలను మూసివేయడంతో ఖాళీ మద్యం సీసాలు సేకరించి విక్రయిస్తూ జీవిస్తున్నాడు.

ఈ క్రమంలో మద్యానికి బానిసైన వీరన్న భార్య యాకమ్మతోపాటు కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య.. వీరన్నను చంపేయాలని నిర్ణయించింది. అయితే, అతడు చనిపోతే తదుపరి జీవనం ఎలా అన్న ఆలోచనతో ముందుగా గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ. 20 లక్షలకు బీమా చేయించింది. అనంతరం చెన్నారావుపేటకు చెందిన వీరన్న సోదరి భూక్యా బుజ్జి, బావ బూక్యా బిచ్చాల సహకారంతో హత్య చేయించింది.

ఈ నెల 19న మద్యం సీసాల సేకరణకు వీరన్న నెక్కొండ వెళ్లగా ఆ సమాచారాన్ని భూక్యా బిచ్చాకు యాకమ్మ అందించింది. దీంతో ఆ రోజు సాయంత్రం నెక్కొండలో వీరన్నను కలిసిన బిచ్చా తన బైక్‌పై ఎక్కించుకుని హత్యా తండాకు బయలుదేరాడు. మార్గమధ్యంలో మద్యం తాగించి రాత్రి 11:45 గంటల సమయంలో పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే యాకమ్మ, బుజ్జి ఉన్నారు.

అందరూ కలిసి వీరన్నకు ఉరేశారు. అయితే, అప్పటికీ ఇంకా అతను బతికే ఉండడంతో ముఖంపై బండరాయితో కొట్టి హత్య చేసి పక్కనే ఉన్న కాలువలో పడేశారు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తర్వాతి రోజు నుంచి తన భర్తను ఎవరో హత్య చేశారంటూ నటించడం మొదలుపెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీల ఆధారంగా హత్య కేసును ఛేదించారు. నిందితులు యాకమ్మ, బిచ్చా, బుజ్జిలను అరెస్ట్ చేశారు.


More Telugu News