బసవతారకం ఆసుపత్రి వర్గాలను అభినందిస్తూ వెంకయ్య, తమిళిసై లేఖలు... సంతోషం వ్యక్తం చేసిన బాలకృష్ణ

  • 20 ఏళ్లు పూర్తిచేసుకున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి
  • ఆసుపత్రి వర్గాలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
  • క్యాన్సర్ రోగులకు అంకితభావంతో సేవలందిస్తామన్న బాలయ్య
నిరుపేద కుటుంబాలకు చెందిన క్యాన్సర్ రోగులకు కూడా అత్యాధునిక చికిత్స అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖల రూపంలో ప్రత్యేక సందేశాన్ని పంపారు. బసవతారకం ఆసుపత్రి వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆసుపత్రి దివంగత నందమూరి తారకరామారావు కలల రూపం అని వెంకయ్య పేర్కొన్నారు. 20 ఏళ్ల కిందట 110 పడకలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి నేడు 500కి పైగా పడకలతో నాణ్యమైన సేవలు అందిస్తోందని కొనియాడారు.

ఇక తమిళిసై తన లేఖలో.... ఈ ఆసుపత్రిని 2000 సంవత్సరం జూన్ 22న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రారంభించారన్న విషయం తెలిసి ఎంతో సంతోషించానని తెలిపారు. అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన అర్ధాంగి బసవతారకం క్యాన్సర్ తో చనిపోవడంతో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని జీవితాశయంగా మలుచుకున్నారన్న విషయం హృదయాన్ని హత్తుకుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ఆసుపత్రి మరింత ఉన్నతస్థాయికి చేరాలని, అనేక మైలురాళ్లు అధిగమించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

తెలంగాణ గవర్నర్ లేఖపై బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర గౌరవనీయ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు సహృదయతతో అందించిన ఆశీస్సులను సంతోషంగా స్వీకరిస్తున్నానని తెలిపారు. మున్ముందు కూడా తమ ఆసుపత్రి క్యాన్సర్ రోగులకు అత్యంత అంకితభావంతో సేవలు అందిస్తుందని ఉద్ఘాటించారు.


More Telugu News