శ్మశానం అన్నారు... ఇవాళ అక్కడి భవనాలను చూడ్డానికి తల ఎత్తాల్సి వచ్చింది: బొత్సపై దేవినేని ఉమ విమర్శలు

  • అమరావతిని శ్మశానంతో పోల్చారన్న ఉమ
  • కోర్టు కేసుల భయంతో రాజధానిలో పర్యటించారని వ్యాఖ్యలు
  • ఎవర్ని మభ్యపెట్టడానికి వచ్చారంటూ ప్రశ్నించిన ఉమ
ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. అక్కడి భవనాలను ఆయన పరిశీలించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు చేశారు. అమరావతిలో మనుషులు తిరగడంలేదని, పశువులు, పందులు తిరుగుతున్నాయని బాధ్యత కలిగిన మంత్రులు గతంలో అన్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని ముంపు ప్రాంతం అన్నారని, అమరావతిని శ్మశానంతో పోల్చారని వెల్లడించారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రులు అమరావతిలో చంద్రబాబు కట్టిన భవనాలను తలెత్తి చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఆకాశాన్నంటేలా ఉన్న ఆ 12 అంతస్తుల భవనాలను చూడ్డానికి మంత్రి బొత్స సత్యనారాయణ మెడలు ఎత్తి మరీ చూడాల్సి వచ్చిందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లు, పేదవాళ్ల కోసం నిర్మించిన 5 వేల ఇళ్లు, నిర్మాణాలు జరుపుకుంటున్న ఇంజినీరింగ్ కాలేజీలను, రైతుల త్యాగాలతో నిర్మాణం జరుపుకుంటున్న అమరావతిని చూడ్డానికి వచ్చిన బొత్స తన అధికారులతో కలిసి తలలు ఎత్తి చూడాల్సి వచ్చిందని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. కోర్టుల్లో కేసులు తరుముతూ ఉంటే, ఇవాళ ఎవరిని నమ్మిద్దామని మంత్రులు డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.

188 రోజులుగా అమరావతిని ప్రజా రాజధానిగా కొనసాగించమని రైతులు, రైతు కూలీలు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తుంటే ఒక్క కుటుంబాన్నైనా పరామర్శించారా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. కోర్టులో కేసుల భయంతో... ఇవాళొచ్చి, ఈ రోడ్డు వెడల్పు చేయండి, ఈ రోడ్డు పనులు మొదలుపెట్టండి అంటూ డ్రామాలు, బిల్డింగులు చూశాం అంటూ మభ్యపెడుతున్నారని, అన్నీ కట్టిపెట్టాలని అన్నారు.



More Telugu News