'108' కుంభకోణాన్ని బయటపెట్టిన పట్టాభిరామ్ పై వేధింపులకు దిగుతున్నారు: చంద్రబాబు

  • హౌస్ అరెస్ట్ చేశారన్న చంద్రబాబు
  • వైసీపీ ఎంపీ అల్లుడికి కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణ
  • ఇంతకన్నా ఆధారాలు ఏంకావాలంటూ విమర్శలు
ప్రజల ప్రాణాలు నిలబెట్టే 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టులో కుంభకోణం జరగడం సిగ్గుచేటు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. అంబులెన్స్ స్కాం వెలుగులోకి వస్తే అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కుంభకోణాన్ని బయటపెట్టిన టీడీపీ నేత పట్టాభిరామ్ పై వేధింపులకు దిగుతోందని ఆరోపించారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

గత ఒప్పందం ప్రకారం బీవీజీ సంస్థకు 2020 డిసెంబరు 12 వరకు కాలపరిమితి ఉందని, కానీ 15 నెలల ముందే కొత్త ఏజెన్సీ కోసం 111 జీవో తీసుకువచ్చారని విమర్శించారు. అంబులెన్స్ నిర్వహణ ఒప్పందం అమలులో ఉండగానే 116 జీవో తీసుకువచ్చి బీవీజీ ఒప్పందాన్ని రద్దు చేశారని చంద్రబాబు వెల్లడించారు. ఫైనాన్స్ విధానంలో కొనుగోలు చేయగలిగిన అంబులెన్స్ లను జీవో 117 తీసుకువచ్చి నేరుగా డబ్బులు చెల్లించి ఎందుకు కొన్నారని నిలదీశారు.

ఒక్కొక్క పాత అంబులెన్స్ కు రూ.47 వేలు, కొత్త అంబులెన్స్ కు రూ.90 వేల చొప్పున మెయింటెనెన్స్ ఖర్చులు పెంచి వైసీపీ ఎంపీ అల్లుడి సంస్థకు ఉన్నపళంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంలో మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏంకావాలని ధ్వజమెత్తారు.


More Telugu News