చైనా సైనికులు వణికిపోయిన వేళ.... బందీలుగా దొరికిన మనవాళ్లను భయంతో వదిలేశారు!

  • చైనాకు బందీలుగా దొరికిన 10 మంది భారత సైనికులు
  • భారత్ ప్రతిదాడి చేస్తుందని హడలిపోయిన చైనా సైనికులు
  • భారత్ జవాన్లను క్షేమంగా విడుదల చేసిన వైనం
లడఖ్ వద్ద గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, 10 మంది చైనా సైన్యానికి బందీలుగా దొరికారు. బందీలుగా పట్టుబడ్డవారిలో ఇద్దరు మేజర్ ర్యాంక్ అధికారులు, ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు ఉన్నారు. వీరందరినీ చైనా సైన్యం గురువారమే విడుదల చేసింది. చైనా నైజం గురించి తెలిసిన చాలామంది వీరి విడుదల ఎంతో కష్టమవుతుందని భావించారు. కానీ జరిగింది వేరు.

గల్వాన్ లోయలో తమ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు నేలకొరిగారని తెలిసిన తర్వాత భారత సైనికులు శివమెత్తారు. చైనా సైనికులపై విరుచుకుపడ్డారు. భారత్ సైనికులు ప్రళయకాల రుద్రుల్లా రెచ్చిపోవడం చూసి ప్రాణాలు కాపాడుకునేందుకు చైనా సైనికులు తమ భూభాగంలోకి కిలోమీటర్ల కొద్దీ పరుగులు తీశారు. సంతోష్ బాబు మరణంతో తీవ్ర ఆవేశంలో ఉన్న భారత సైనికులు తాము ఎక్కడ ఉన్నదీ గుర్తించలేకపోయారు. చైనా సైనికులను అలాగే వెంట తరుముతూ వెళ్లి చైనా అదనపు బలగాల చేతచిక్కారు.

మొదట్లో ఈ ఘర్షణను ఎప్పట్లాగానే సాధారణమైనదిగా తీసుకున్న చైనా... భారత్ సైనికుల పోరాటపటిమ చూసి హడలిపోయింది. భారత్ ప్రతీకారం తీవ్రస్థాయిలో ఉండొచ్చని భయంతో వణికిపోయింది. సరిహద్దు దాటి వస్తే చిత్రహింసలు పెట్టే చైనా తమ చేత 10 మంది చిక్కినా వారిని ఏంచేయడానికి సాహసించలేకపోయింది. చైనా సైనికాధికారులు సైతం ఏంచేయాలో అర్థం కాని స్థితిలో బందీలను వదిలేశారు. చైనా చెర నుంచి విడుదలైన సందర్భంగా భారత సైనికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జవాన్లు దాడి అనంతరం చైనా సైనికుల పరిస్థితి గురించి పై వివరాలు తెలిపారు.


More Telugu News