ఒక్కసారి పూరీ రథయాత్ర జరపకుంటే మళ్లీ 12 ఏళ్ల వరకు జరపకూడదన్నది ఆచారం: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

  • రేపు జరగాల్సి ఉన్న పూరీ జగన్నాథ రథయాత్ర 
  • నిలిపివేతపై తీర్పును పునఃపరిశీలించాలంటూ పిటిషన్లు 
  • విచారణకు ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సుప్రీం
  • శతాబ్దాలుగా వస్తోన్న ఆచారాన్ని ఆపడం సరికాదన్న ఎస్‌జీ
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర రేపు జరగాల్సి ఉండగా కరోనా వ్యాప్తి ప్రమాదం పొంచి ఉండడంతో సుప్రీంకోర్టు దాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్పును పునఃపరిశీలించాలంటూ వచ్చిన నాలుగు పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. విచారణకు ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

రథయాత్ర జరపకుంటే 12 ఏళ్ల వరకు దాన్ని తిరిగి నిర్వహించకూడదన్న ఆచారం ఉందని సుప్రీంకోర్టుకు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా తెలిపారు. ఇది కోట్లాది మంది విశ్వాసాల‌కు సంబంధించిన అంశ‌మ‌ని ఆయన అన్నారు.

శతాబ్దాలుగా వస్తోన్న ఆచారాన్ని ఆపడం సరికాదని ఆయన అన్నారు. జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర సంద‌ర్భంగా ఆలయ సిబ్బంది మాత్రమే అందులో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పరిమిత సంఖ్యలో ఆలయసిబ్బందిని అనుమతించి ర‌థ‌యాత్ర‌ను నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని కేంద్ర ప్రభుత్వం, ఒడిశా ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలిపాయి. రథయాత్రపై స్టే ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరాయి. దీనిపై త్రిసభ్య ధర్మాసనం కాసేపట్లో విచారణ చేబడుతుంది.


More Telugu News