ఇండియన్స్ కే అధిక నష్టం... నేడు హెచ్-1బీ వీసాల నిబంధనల బిల్లుపై ట్రంప్ సంతకం!

  • ఎన్నికలు జరుగనున్న తరుణంలో ట్రంప్ కీలక నిర్ణయం
  • ఉద్యోగ వీసాలను పూర్తిగా రద్దు చేయాలని భావిస్తున్న ట్రంప్
  • ఇప్పటికే 2.40 లక్షల మంది దరఖాస్తు
అమెరికాలో ఉద్యోగ ఆధారిత వీసాలను నియంత్రించేందుకు రూపొందించిన ఓ కీలక బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు సంతకం చేయనున్నారు.  అమెరికాలో ఉద్యోగం చేయడానికి అనుమతి కోసం దాదాపు 2.40 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్న వేళ, ఈ వీసాలను ప్రస్తుత సంవత్సరంలో పూర్తిగా రద్దు చేయడం ద్వారా అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించవచ్చన్న ఆలోచనలో ఉన్న ట్రంప్, వెంటనే ఈ ప్రతిపాదనలకు అంగీకరించనున్నారని సమాచారం. మరో నాలుగు నెలల్లో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోవాల్సిన ట్రంప్, వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుండగా, దీని వల్ల, అత్యధిక నష్టం భారత సాఫ్ట్ వేర్ నిపుణులకేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజాగా 'ఫాక్స్ న్యూస్'కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇస్తూ, అమెరికాలో పలు రకాల ఉపాధి పనుల నిమిత్తం జారీ చేసిన వీసాలపై కొత్త నిబంధనలను సోమవారంలోగా అమలులోకి తేనున్నట్టు వెల్లడించారు. అయితే, ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిపై ప్రభావం చూపబోదని ఆయన స్పష్టం చేశారు. వివిధ రకాల వీసా కేటగిరీలపై రానున్న నిబంధనలు అమెరికాలోనే నిపుణులైన నిరుద్యోగులకు ఉపాధిని కల్పించేలా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. హెచ్-1బీతో పాటు, ఎల్-1 ప్రోగ్రామ్, హెచ్-2బీ వీసాల విషయంలో నిబంధనలు మారనున్నాయని ఆయన అన్నారు.

కాగా, అమెరికాలోకి ఈ తరహా వీసాలతో వచ్చిన వారు 180 రోజుల వరకూ ఉపాధిని పొందే అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వారు తమ వీసాలను యాజమాన్య కంపెనీల సాయంతో పొడిగించుకుని, అక్కడే శాశ్వత నివాసాలను ఏర్పరచుకుంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలన్నదే ట్రంప్ ఆలోచన. 2019 సంవత్సరంలో ప్రాథమిక ఉపాధి కింద 1.33 లక్షల మందికి హెచ్-1బీ వీసాలు రాగా, అందులో 12 వేల మందికి ఎల్-1వీసాలు ఆమోదించబడ్డాయి. మరో 98 వేల మందికి హెచ్-2బీ వీసాల దరఖాస్తులను అధికారులు ప్రాసెస్ చేశారు. వీరెవరికీ ఇంకా అమెరికాలో శాశ్వత ఉపాధి లభించనట్లే. వర్క్ వీసా కేటగిరీల్లో ట్రంప్ కొత్త ఆలోచన సుమారు 2.40 లక్షల మంది దరఖాస్తులపై ప్రభావం చూపుతుందని అంచనా.


More Telugu News