కరోనా కంటే బోల్సనారో వైరస్ అత్యంత ప్రమాదకరం.. బ్రెజిల్ అధ్యక్షుడిపై విమర్శల వెల్లువ

  • బోల్సనోరా విధానాలతో దేశంలో పెరుగుతున్న కేసులు
  • కఠిన చర్యలు తీసుకోకుంటే తిరుగుబాటు తప్పదు
  • వైరస్ కంటే లాక్‌డౌన్, భౌతిక దూరమే ప్రమాదకరమంటున్న బోల్సనోరా
బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనోరా అవలంబిస్తున్న ఏకపక్ష విధానాల కారణంగా కరోనా కోరల్లో చిక్కుకుపోయిన బ్రెజిల్ విలవిల్లాడుతోంది. ప్రపంచంలో అత్యధిక కేసుల జాబితాలో అమెరికా తర్వాతి స్థానంలో వచ్చేసిన బ్రెజిల్ వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దేశంలోని సావోపాలో గవర్నర్ జాయ్ డోరియా మాట్లాడుతూ అధ్యక్షుడు బోల్సనోరాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ఇప్పుడు బోల్సనోరా వైరస్ పట్టి పీడిస్తోందని మండిపడ్డారు. వైరస్ విజృంభించినప్పటికీ లాక్‌డౌన్, భౌతిక దూరం వంటి చర్యలను అధ్యక్షుడు తొలి నుంచీ వ్యతిరేకిస్తూ రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్న ఆరోపణలున్నాయి.  

ఈ నెల మొదటి వారం నుంచి రోజుకు సగటున 30 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటేశాయి. అలాగే, మృతుల సంఖ్య 50 వేలు దాటేసింది. పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నా వైరస్ కంటే లాక్‌డౌన్ అత్యంత ప్రమాదకరమని బోల్సనోరా పేర్కొన్నారు.

కాగా, బ్రెజిల్ ఇప్పటికైనా కళ్లు తెరిచి కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టకపోతే దేశప్రజలు అసహనంతో తిరుగుబాటుకు దిగడం ఖాయమని ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) హెచ్చరించింది.


More Telugu News