చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ఏపీ ప్రభుత్వం లీగల్‌ నోటీసులు జారీ

  • 15 రోజుల్లో క్షమాపణలు చెప్పాల్సిందే
  • లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు
  • లీగల్ నోటీసులు పంపిన ప్రభుత్వం
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ లీగల్ నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కు సున్నపురాయి మైనింగ్‌ లీజు వ్యవహారంలో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వార్తలు రాశాయని ఆరోపిస్తూ ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు), ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి)తోపాటు అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపినట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి తెలిపారు.

15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరంగా ప్రభుత్వం సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటుందంటూ చంద్రబాబుతోపాటు ఆ రెండు సంస్థలకు లీగల్‌ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు.

అలాగే, నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన సంచులను ప్రభుత్వం టెండర్లు పిలవకుండానే సీఎం వైఎస్ జగన్‌కు సంబంధించిన సంస్థ నుంచి కొనుగోలు చేసిందంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, ఆ వార్తను ప్రచురించిన ఈనాడు పత్రిక ఫౌండర్‌ డైరెక్టర్ రామోజీరావు, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావులకు ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇవి అందిన ఏడు రోజుల్లోనే క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.


More Telugu News