చైనాకు దీటుగా బదులిచ్చేందుకు సిద్ధమవుతున్న భారత్‌.. గాల్వన్‌ నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి

  • గాల్వన్‌ వద్ద భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు 
  • సైనిక, యుద్ధ వాహనాల రాకపోకల కోసం గాల్వన్‌ నదిపై బ్రిడ్జి
  • పోర్టబుల్‌ బ్రిడ్జి నిర్మాణం 72 గంటల్లో పూర్తి
  • 60 మీటర్ల పొడవుగల వంతెన
గాల్వన్‌ వద్ద భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటోన్న నేపథ్యంలో చైనా దుస్సాహసానికి పాల్పడితే దీటుగా బదులిచ్చేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. సైనిక, యుద్ధ వాహనాల రాకపోకల కోసం గాల్వన్‌ నదిపై తలపెట్టిన పోర్టబుల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని భారత ఆర్మీ ఇంజనీర్లు కేవలం 72 గంటల్లో పూర్తిచేసినట్లు తెలిసింది.

ఈ వంతెన 60 మీటర్ల పొడవు ఉంటుంది. గడ్డకట్టే చలిలో పాటు అక్కడి ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. అలాగే, ఆ ప్రాంతంలో రోడ్లు, ఇతర వంతెనల నిర్మాణాన్ని కూడా ఆగమేఘాలపై పూర్తి చేస్తున్నారు. చైనా బెదిరింపులకు లొంగకుండా భారత్‌ చేపట్టిన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని సైనికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే సూచనలు అందినట్లు తెలిసింది.

గాల్వన్‌ నదిపై బ్రిడ్జితో పాటు రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే గాల్వన్‌ లోయతో పాటు నార్త్‌ సెక్టార్లకు భారత సైన్యం సులభంగా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంటుంది. మరోవైపు, గాల్వన్‌ లోయపై పట్టు సాధించేందుకు చైనా అనేక కుట్రలు పన్నుతోంది. భారత భూభాగంలోని గాల్వన్‌ నదిపై డ్యామ్‌ నిర్మాణం చేపట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి పలు ఫొటోలను ప్లానెట్‌ ల్యాబ్స్‌ ఇటీవల విడుదల చేసింది.


More Telugu News