ప్రతి దాడి చేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేయండి: అమరీందర్ సింగ్

  • చైనా చర్యలపై పంజాబ్‌, మధ్యప్రదేశ్ సీఎంల ఆగ్రహం
  • భారత భూభాగాన్ని వెంటనే ఖాళీ చేయమనండి: అమరీందర్
  • ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అవి శాశ్వతంగా ఉండవు
  • చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి: చౌహాన్
చైనా చర్యలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత భూభాగాన్ని వెంటనే ఖాళీ చేసి వెళ్లకపోతే ప్రతి దాడి చేస్తామని చైనాకు హెచ్చరికలు జారీ చేయాలని మోదీ సర్కారుని పంజాబ్ సీఎం అమరీందర్‌ సింగ్‌ కోరారు. భారత్‌ తీసుకునే ఈ చర్య వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అవి శాశ్వతంగా ఉండవని చెప్పారు.

20 మంది భారత జవాన్లపై చైనా సైనికులు దారుణంగా దాడిచేసి హతమార్చారని, ఇన్నేళ దౌత్యం విఫలమైందని అమరీందర్ తెలిపారు. భారత్ కూడా చైనాకు ఏ మాత్రమూ తీసిపోని దేశమని చెప్పారు. 1962 నుంచి చైనా ఆక్రమణలు చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు జవాన్ల మృతదేహాలకు అమరీందర్ సింగ్ నివాళులు అర్పించి ఈ వ్యాఖ్యలు చేశారు.
 
చైనా తీరుపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని, చైనాలో తయారైన వస్తువులను బహిష్కరించాలని తాను మధ్యప్రదేశ్‌ ప్రజలను కోరుతున్నానని తెలిపారు. చైనాకు భారత సైన్యం తగిన సమాధానం చెప్పిందన్నారు.  మనం కూడా చైనాను  ఆర్థికంగా దెబ్బతీయాలని పిలుపునిచ్చారు.


More Telugu News