రూ. 50 వేల కోట్లతో కొత్త పథకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ!

  • వలస కార్మికుల కోసం కొత్త పథకం
  • గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన ప్రారంభం
  • వ్యూహాత్మకంగా బీహార్ లో ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ, నేడు లక్షలాది మంది వలస కార్మికులకు ఉపాధిని కల్పించేందుకు ఉద్దేశించిన 'గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన' పథకాన్ని ఆవిష్కరించారు. సుమారు రూ. 50 వేల కోట్లతో ఈ పథకాన్ని ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడమే ఈ పథకం లక్ష్యం. కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన వారికి పని కల్పించి, వారికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.

బీహార్ లోని ఖగారియా జిల్లాలో ఈ పథకం నేడు ప్రారంభమైంది. త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ, వ్యూహాత్మకంగా పథకం ప్రారంభానికి ఈ జిల్లాను మోదీ ఎంచుకున్నారు. ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ పథకాన్ని ప్రారంభించారు. లాక్ డౌన్ కారణంగా తామున్న ప్రాంతంలో పనులు లేక, అష్టకష్టాలు పడుతూ స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికుల అవస్థలు తనను కదిలించాయని, వారి కోసమే ఈ పథకమని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.

"వలస కార్మికులకు వారి ఇళ్లకు సమీపంలోనే పనులు ఇస్తాం. ఇప్పటివరకూ మీ టాలెంట్ ను నగరాభివృద్ధికి వినియోగించారు. ఇక మీ ప్రాంతంలో అభివృద్ధికి, మీ సమీప ప్రాంతాల అభివృద్ధికి వినియోగించండి" అని కార్మికులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించామని, ఇందుకు రూ. 50 వేల కోట్లను ఖర్చు చేస్తామని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు.


More Telugu News