జడ్చర్ల కాంగ్రెస్ నేత దారుణ హత్య.. భూ వివాదమే కారణం!

  • కత్తితో మెడ, పొట్ట భాగంలో పొడిచి చంపిన హంతకులు
  • రూ. 6 కోట్ల విలువైన భూమిపై కోర్టులో నడుస్తున్న వివాదం
  • రక్త సంబంధీకులపైనే పోలీసుల అనుమానం
తెలంగాణలోని జడ్చర్లకు చెందిన కాంగ్రెస్ నేత రాంచంద్రారెడ్డి (72) నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. షాద్‌నగర్ మండలం అన్నారానికి చెందిన రాంచంద్రారెడ్డి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలో ఆయనకు ఉన్న భూముల్లో 9 ఎకరాల విషయంలో రక్త సంబంధీకులతో వివాదం ఉంది. ప్రస్తుతం ఇది కోర్టులో ఉంది. ఈ భూమి విలువ దాదాపు 6 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. రాంచంద్రారెడ్డి బంధువులకు సంబంధించిన వ్యవహారాలను స్థానికంగా ఉండే ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి చూసుకుంటున్నాడు.
 
రాంచంద్రారెడ్డి నిన్న తన భూముల వద్దకు వెళ్లి తిరిగి షాద్‌నగర్ బయలుదేరారు. ఈ క్రమంలో వెల్జర్లకు చెందిన ఓ యువకుడితో కలిసి బైక్‌పై వచ్చిన ప్రతాప్‌రెడ్డి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో రాంచంద్రారెడ్డి కారును అడ్డుకున్నాడు. డ్రైవర్ పాషాను కత్తితో బెదిరించడంతో అతడు అక్కడి నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్‌‌కు చేరుకుని విషయం చెప్పాడు.

మరోవైపు, రాంచంద్రారెడ్డిని ఆయన కారులోనే ప్రతాప్‌రెడ్డి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. రాంచంద్రారెడ్డి డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాంచంద్రారెడ్డి కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా చివరికి కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రాంచంద్రారెడ్డి హత్యకు గురయ్యారు. తన కారులోనే మృతి చెంది ఉన్న ఆయన మెడ, పొట్టభాగంలో కత్తితో పొడిచి చంపిన ఆనవాళ్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. భూ వివాదమే ఆయన హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News