కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో రెండు, మూడు నెలలకే యాంటీబాడీలు మాయం!

  • యాంటీబాడీలపై తాజా అధ్యయనం
  • లక్షణాలు లేని వారిలో తక్కువస్థాయి యాంటీబాడీలు
  • కరోనా వ్యాక్సిన్ పరిశోధనకు ఉపయోగపడనున్న అధ్యయనం
ఇప్పుడు ప్రపంచ మానవాళికే సవాల్ గా మారిన కరోనా మహమ్మారి ప్రభుత్వాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణ జనజీవనానికి తీవ్ర ప్రతిబంధకంగా మారిన కరోనా దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో సమర్థవంతమైన వ్యాక్సిన్ ఒక్కటే ఆశాదీపంలా కనిపిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నా, ఇప్పట్లో వ్యాక్సిన్ వస్తుందన్న భావన బలపడడంలేదు. ఈ నేపథ్యంలో నేచర్ మెడిసిన్ జర్నల్ లో ఆసక్తికర అధ్యయనం ప్రచురితమైంది.

సాధారణంగా ఓ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తుల్లో వ్యాధికారక కణాలను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయి. ఆ వ్యక్తిలోని వ్యాధినిరోధక శక్తి స్థాయిని బట్టి వాటి కాలపరిమితి ఆధారపడి ఉంటుంది. కానీ, తాజా అధ్యయనం ప్రకారం, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో యాంటీబాడీలు రెండు, మూడు నెలలు మాత్రమే ఉంటున్నాయని వెల్లడించారు. అంతేకాదు, కరోనా లక్షణాలతో బాధపడిన వ్యక్తులతో పోల్చితే, లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో తక్కువస్థాయిలో యాంటీబాడీలు ఏర్పడుతున్నట్టు తెలిపారు.

ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు పరిమిత పరిధిలోనివే అయినా, కరోనా వ్యాక్సిన్ పరిశోధనల్లో కీలకం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. గత పరిశోధనల్లో.... కరోనా నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు తయారవుతున్నట్టు గుర్తించినా, అవి ఎంతకాలం ఉంటాయన్న దానిపై స్పష్టత లేదు. తాజాగా జరిపిన అధ్యయనంలో యాంటీబాడీలు కాలావధిపై అవగాహన వచ్చింది.

కాగా, నేచుర్ మెడిసన్ జర్నల్ లో ప్రచురితమైన మరో అధ్యయనంలో కొద్దిమొత్తంలో యాంటీబాడీలు ఉన్నా సరే కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో యాంటీబాడీలు అంతర్థానమైతే, మళ్లీ కరోనా సోకే అవకాశాలున్నాయా అన్నదానిపై పరిశోధకులు స్పష్టత ఇవ్వలేదు.


More Telugu News