ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం... 20 పార్టీలు హాజరు

  • ప్రధాని నివాసంలో వీడియో కాన్ఫరెన్స్
  • చైనా విషయం చర్చించడమే ప్రధాన అజెండా
  • కశ్మీర్ అంశం చైనాకు కంటగింపుగా ఉందన్న సీఎం కేసీఆర్
  • అఖిలపక్షానికి తమను పిలవకపోవడంపై ఒవైసీ అసంతృప్తి
లడఖ్ వద్ద గాల్వన్ లోయలో చైనా దౌర్జన్యాలు, భారత్ అవలంబించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసం నెం.7, లోక్ మార్గ్ లో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు 20 పార్టీలు హాజరయ్యాయి. ఏపీ సీఎం జగన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. మోదీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, అనేక పార్టీల నేతలు హజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా గాల్వన్ లోయలో అమరులైన భారత జవాన్లకు నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు.

కాగా, ఈ అఖిలపక్ష సమావేశానికి తమ ఎంఐఎం పార్టీని ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పరిణామం తమనెంతో నిరాశకు గురిచేసిందని తెలిపారు.

ఇక సమావేశంలో పాల్గొన్న నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కశ్మీర్ పై ప్రధాని స్పష్టమైన అభిప్రాయాలతో ఉండడం, కశ్మీర్ అభివృద్ధిపై ప్రధాని దార్శనికత చైనాకు కంటగింపుగా మారిందని, ప్రధాని పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపు కూడా చైనాను అసహనానికి గురిచేసిందని అన్నారు.

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, దేశభక్తి విషయానికొస్తే మనమందరం ఒక్కటేనని ఉద్ఘాటించారు. చైనా విషయంలో ప్రధాని ఇటీవల చేసిన ప్రకటనలకు తాము మద్దతిస్తున్నామని చెప్పారు.


More Telugu News