కరోనా కలకలం.. క్షీణించిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఆరోగ్యం

  • సత్యేందర్ జైన్ ఆరోగ్య పరిస్థితి విషమం
  • ప్లాస్మా థెరపీ చేసేందుకు ఏర్పాట్లు
  • బాధ్యతలు డిప్యూటీ సీఎంకు అప్పగింత
కరోనా దెబ్బకు సామాన్యులే కాకుండా వీవీఐపీలు సైతం బాధితులుగా మారిపోతున్నారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి విషమించినట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు న్యుమోనియా కూడా జతకావడంతో... శ్వాసపరమైన ఇబ్బందులు పెరిగాయి. దీంతో ఆయనకు ప్లాస్మా థెరపీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

తీవ్ర జ్వరం, శ్వాసపరమైన ఇబ్బందులతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన చేరారు. మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. బుధవారం మరోసారి టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే స్వయంగా  ప్రకటించారు. కరోనా బారిన పడిన నేపథ్యంలో... ఆరోగ్య శాఖ బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీశ్ శిసోడియాకు ఆయన అప్పగించారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే అతిషి, సీఎం సలహాదారు అక్షయ్ మరాఠే, డిప్యూటీ సీఎం శిసోడియా సలహాదారు అభినందిత కూడా కరోనా బారిన పడ్డారు.


More Telugu News