అద్భుతమైన ఆప్షన్ ను తీసుకొచ్చిన వాట్సాప్!

  • పేమెంట్స్ ఆప్షన్ ను తీసుకొచ్చిన వాట్సాప్
  • తొలిసారిగా బ్రెజిల్ లో అందుబాటులోకి వచ్చిన ఆప్షన్
  • ప్రస్తుతానికైతే సదుపాయాన్ని ఉచితంగా వినియోగించుకునే అవకాశం
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడినది ఏదైనా ఉందా? అంటే... అది కచ్చితంగా వాట్సాప్ అని చెప్పొచ్చు. వాట్సాప్ వినియోగించని వ్యక్తి దాదాపుగా లేడనే చెప్పొచ్చు. ఐదు నిమిషాలకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ లను చెక్ చేసుకోకపోతే చాలా మందికి అదోలా ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ రాకపోతే కంగారు పడేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అంతగా జనాలకు వాట్సాప్ చేరువైంది. తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ ను తన వినియోగదారులకు వాట్సాప్ అందించింది. అదే పేమెంట్స్ ఆప్షన్.

ఈ 'పేమెంట్స్' ఆప్షన్ ద్వారా వాట్సాప్ నుంచి నగదును పంపుకోవడం, స్వీకరించడం చేయవచ్చు. కొన్ని నెలలుగా ఈ ఆప్షన్ పై ట్రయల్స్ వేసిన వాట్సాప్... చివరకు పేమెంట్స్ ఆప్షన్ ను రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను తన రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన బ్రెజిల్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో ఇతర దేశాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరింపజేసేందుకు వాట్సాప్ సన్నాహకాలు చేసుకుంటోంది.

ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని వాట్సాప్ యూజర్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. బిజినెస్ పే సర్వీసుకు మాత్రం 3.99 శాతం ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నంబర్ల పిన్ లేదా ఫింగర్ ప్రింట్ ఫీచర్ ద్వారా లావాదేవీలను చేయవచ్చు. అంతేకాదు, వాట్సాప్ అకౌంట్ ద్వారా లింక్ చేసుకున్న వీసా లేదా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డులకు కూడా ఈ సదుపాయం సపోర్ట్ చేస్తుంది. గత ఏడాది ఫేస్ బుక్ కూడా తన యాప్ లో 'ఫేస్ బుక్ పే' ఆప్షన్ ను విడుదల చేసిన సంగతి  తెలిసిందే.


More Telugu News