చైనా వస్తువులను వాడకుండా అతి త్వరలోనే నిబంధనలు: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్

  • ఇప్పటికే చైనా వస్తువులను బ్యాన్ చేయాలని ప్రచారం
  • తగిన విధి విధానాలు తయారవుతున్నాయి
  • ప్రజలే స్పందించి చైనా ఉత్పత్తులు కొనకుండా ఉండాలి
  • కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రి పాశ్వాన్
చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, చైనా వస్తువులను భారతీయులు కొనుగోలు చేయరాదని ప్రచారం జరుగుతున్న వేళ, ఇప్పటికే చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని నిర్ణయించిన ఇండియా, అందుకు తగిన విధి విధానాలను అతి త్వరలో ప్రకటించనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఈ విషయంలో ప్రజలే చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాల్సి వుందని, ప్రజల్లో స్పందన వస్తేనే చైనాకు బుద్ధి తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం తరఫున కూడా చైనా దిగుమతులను క్రమంగా తగ్గిస్తామని వెల్లడించిన ఆయన, ఇండియాకు తొలి శత్రువు చైనాయేనని నాడు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ అన్న మాటల్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. మనకు ప్రమాదకరంగా మారిన పొరుగు దేశం నుంచి వస్తు ఉత్పత్తులను కొనాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

"చైనా ఇటువంటి దాడికి దిగి, మన సైనికులను అమరులను చేసిందంటే, ద్వైపాక్షిక చర్చల కన్నా, వారి వస్తువులను కొనకుండా ఉంటేనే ఆ దేశానికి మరింత నష్టం కలుగుతుంది. భారతీయులు తమ ఇళ్లలో పూజించే వినాయకుడి విగ్రహాలను, చైనా నుంచి ఎందుకు తెచ్చుకోవాలి?" అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికే భారత వస్తువుల క్వాలిటీని పెంచేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలను కఠినతరం చేసిందని గుర్తు చేసిన ఆయన, అతి త్వరలో కొత్త నిబంధనలు, నియంత్రణా విధానాన్ని దిగుమతులపై ప్రకటించనున్నామని రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ నిబంధనలు అమలులోకి వస్తే, చౌక, తక్కువ క్వాలిటీతో కూడిన దిగుమతులకు అడ్డుకట్ట పడుతుందని ఆయన అన్నారు. ఇండియాలో ప్రస్తుతం 25 వేలకు పైగా వస్తు ఉత్పత్తులకు బీఐఎస్ నిర్ధారణ ఉందని, కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, క్వాలిటీతో కూడిన మరిన్ని ఉత్పత్తులు ఇండియాలోనే లభిస్తాయని అన్నారు.

"ఇప్పుడున్న నిబంధనల ప్రకారం మన బాస్మతి బియ్యం ఎగుమతులను వెనక్కు పంపుతున్నారు. కానీ, వారి నుంచి వచ్చే నాణ్యతలేని ఉత్పత్తులు ఇండియాలో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో కఠినమైన క్వాలిటీ కంట్రోల్ విధానాలు లేవు. ఈ పరిస్థితి అతి త్వరలోనే మారనుంది" అని ఆయన అన్నారు.


More Telugu News