అప్రమత్తం కాకుంటే మానవాళి మనుగడకు ప్రమాదం తప్పదు: డబ్ల్యూడబ్ల్యూఎఫ్

  • వన్యప్రాణులకు హాని తలపెడితే ఇబ్బందులు తప్పవు
  • ప్రాణాంతక, ప్రమాదకర వ్యాధులు చెలరేగే అవకాశం
  • ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సమప్రాధాన్యం ఇవ్వాలి
భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు మానవాళిని కబళించే అవకాశం ఉందని, అప్రమత్తం కాకుంటే తీవ్ర నష్టం తప్పదని వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇంటర్నేషనల్‌ హెచ్చరించింది. ఈ మేరకు ‘కోవిడ్‌–19: అర్జెంట్‌ కాల్‌ టు ప్రొటెక్ట్‌ పీపుల్‌ అండ్‌ నేచర్‌’ తాజా నివేదికలో పేర్కొంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపకుంటే, వన్యప్రాణులకు హాని తలపెడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చని, ప్రాణాంతక, ప్రమాదకరమైన వ్యాధులు, వైరస్‌లు చెలరేగిపోవడం ఖాయమని అందులో ఆందోళన వ్యక్తం చేసింది.

1990ల నుంచి మనుషుల్లో బయటపడిన కొత్త వ్యాధుల్లో దాదాపు 70 శాతం వన్యప్రాణుల నుంచి వచ్చినవేనని, అదే సమయంలో 178 మిలియన్ హెక్టార్ల అడవి కనుమరుగైపోయిందని, దీనిని బట్టి అడవి, వ్యాధుల మధ్య ఉన్న సంబంధం ఏంటనేది అర్థం చేసుకోవచ్చని తెలిపింది.

ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సమప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టేట్‌ డైరెక్టర్‌ ఫరీదా తంపాల్ అన్నారు. చాలా వరకు వైరస్‌లు వన్యప్రాణులు, జంతువుల నుంచే సోకుతున్నాయని అన్నారు. వైరస్‌లు వాటి శరీరంలో ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదం లేదని, కానీ వాటిని చంపి తినడం వల్ల మనుషులకు సోకుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి వన్యప్రాణులను ఆహారంగా తీసుకోవడం తగదని తంపాల్ సూచించారు.


More Telugu News