పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ కు ముందు కూడా ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు: లడఖ్ బీజేపీ ఎంపీ

  • చైనాకు బుద్ధి చెప్పేందుకు సమయం ఆసన్నమైంది
  • అది అక్సాయ్ చిన్ కాదు.. చైనా ఆక్రమించుకున్న లడఖ్
  • సైనికుల త్యాగాలు వృథా పోనివ్వమని మోదీ చెప్పారు
  • ప్రభుత్వ ఆలోచన ఏమిటో నాకు అర్థమవుతోంది
చైనాకు బుద్ధి చెప్పేందుకు, 1962 యుద్ధంలో ఆ దేశం ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సమయం ఆసన్నమైందని లడఖ్ బీజేపీ ఎంపీ జమ్యాంగ్ సేరింగ్ నాంగ్యాల్ అన్నారు. 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ఇక ఉపేక్షించడం అనవసరమని... వన్ టైమ్ సొల్యూషన్ కావాల్సిందేనని చెప్పారు. 2016లో పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ కు ముందు ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలే చేశారని ఎన్డీటీవీ  తో మాట్లాడుతూ  చెప్పారు.

లడఖ్ ప్రజలంతా దేశం, సైన్యం వెంటే ఉన్నారని సేరింగ్ అన్నారు. భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని చెప్పారు. లడఖ్ ప్రజలు మాత్రమే కాకుండా దేశ ప్రజలంతా వన్ టైమ్ సొల్యూషన్ కోరుకుంటున్నారని అన్నారు. మన సైనికులు తరచుగా ప్రాణాలు కోల్పోవడాన్ని, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురి కావడాన్ని తాము కోరుకోవడం లేదని చెప్పారు. అందుకే వన్ టైమ్ సొల్యూషన్ ను తాము కోరుకుంటున్నామని అన్నారు.

1962 నుంచి ఇప్పటి వరకు ఇండియాను చైనా కొన్ని వందల సార్లు మోసగించిందని ఆయన మండిపడ్డారు. 1962 యుద్ధంలో భారత్ కు చెందిన 37,244 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని (అక్సాయ్ చిన్) ఆక్రమించుకుందని అన్నారు. అక్సయ్ చిన్ అనే పదాన్ని కూడా తాను వినలేనని... అది అక్సాయ్ చిన్ కాదని, చైనా ఆక్రమించుకున్న భారత భూభాగమని చెప్పారు. అది చైనా ఆక్రమించుకున్న లడఖ్ అని అన్నారు. ఆ ప్రాంతాన్ని భారత్ వెనక్కి తీసుకోగలదా? అని చాలా మంది ప్రశ్నిస్తుంటారని... అది అంత సులభం కాకపోయినా, అసాధ్యం మాత్రం కాదని చెప్పారు. మన సైనికుల ప్రాణ త్యాగాల తర్వాత... అక్సాయ్ చిన్ ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నానని అన్నారు.

ప్రస్తుతం ఉన్న భారత ప్రభుత్వం 1962 నాటి ప్రభుత్వం లాంటిది కాదని సేరింగ్ అన్నారు. ప్రధాని మోదీ ఏది చెపితే అది చేసి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. తమ సైనికుల ప్రాణ త్యాగాలను వృథా పోనివ్వమని పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ కి ముందు మోదీ చెప్పారని... నిన్న మరోసారి అదే మాటను చెప్పారని అన్నారు. ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉందో, ఏం చేయబోతోందో ఆ మాటతో తనకు అర్థమవుతోందని చెప్పారు.


More Telugu News