కరోనా వ్యాప్తి ప్రభావం.. తమిళనాడులో నాలుగు జిల్లాల్లో వాహన విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై నిషేధం
- తమిళనాడులో పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్న కేసులు
- చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో రేపటి నుంచి సంపూర్ణ కర్ఫ్యూ
- 33 శాతం ఉద్యోగులతో ఆర్టీఏ కార్యాలయంలో విధులు
తమిళనాడులో కరోనా కేసులు ప్రతి రోజూ పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండడంతో రాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో వాహన విక్రయాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ తెన్‌కాశి జవహర్ తెలిపారు. చెన్నైతోపాటు తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో చెన్నై సహా ఈ మూడు జిల్లాల్లోనూ వాహన విక్రయాలపై నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. వాహన విక్రయాలతోపాటు రిజిస్ట్రేషన్ సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఆర్టీవో, రవాణాశాఖ కార్యాలయాల్లో 33 శాతం మంది ఉద్యోగులు, షిఫ్టుల విధానంలో ఉద్యోగులు పనిచేస్తారని ఆయన వివరించారు. కాగా, ఈ నాలుగు జిల్లాల్లో రేపటి నుంచి ఈనెల 30 వరకు సంపూర్ణ కర్ఫ్యూ విధించనున్నారు.