వైరస్ ను చంపే కొత్తరకం ఫేస్ మాస్క్.. వారంలో ఇండియాలో అమ్మకాలు!

  • 99.9 శాతం వైరస్ ను అడ్డుకునే మాస్క్
  • 0.8 మిల్లీ ఓట్ల విద్యుదావేశాన్ని పుట్టించే గుడ్డతో తయారీ
  • నవీ ముంబయిలో తయారు అవుతున్న మాస్క్ లు
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకునేందుకు ఫేస్ మాస్క్ తప్పనిసరైన వేళ, స్విట్జర్లాండ్ కు చెందిన ఓ సంస్థ వినూత్న మాస్క్ ను తయారు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా దగ్గినా, తుమ్మినా, కరోనా వైరస్ క్రిములు మాస్క్ పై పడితే, అవి వెంటనే చనిపోయేలా పనిచేసే మాస్క్ ను లివింగ్ గార్డ్ తయారు చేసింది. ఈ మాస్క్ లో భిన్నమైన వస్త్రాన్ని, రసాయనిక బంధాల పోగుల ద్వారా తయారు చేశామని, దీనిపై ప్రతిక్షణం 0.1 నుంచి 0.8 మిల్లీ ఓట్ల ధనాత్మక విద్యుదావేశం పుడుతూ ఉంటుందని, దాని ద్వారా వైరస్ క్రిములు నశిస్తాయని సంస్థ వెల్లడించింది.

కొవిడ్-19 వైరస్ తో పాటు పలు రకాల బ్యాక్టీరియాలను ఇది నశింపజేస్తుందని, ఈ మాస్క్ లో ప్రతి చదరపు సెంటీమీటర్ కూ 2,600 కోట్ల విద్యుదావేశాలు పుడతాయని, దీన్ని తాకగానే, వైరస్ పై పొరలు పేలి, అవి మరణించడం లేదా నిర్వీర్యం కావడం జరుగుతుందని సంస్థ సీటీవో, భారత సంతతి శాస్త్రవేత్త సంజీవ్ స్వామి వెల్లడించారు. తాజాగా ఓ వెబినార్ లో సీఎస్‌ఐఆర్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్‌ఏ మషేల్కర్ లతో కలసి పాల్గొన్న ఆయన, తాము 1000కిపైగా రసాయనాలను పరిశీలించి, అందులో నుంచి 8 రసాయనాలను ఎంపిక చేసి, ప్రత్యేక పద్ధతుల్లో మాస్క్ ను తయారు చేశామని అన్నారు.

ఈ మాస్క్ లను వాడిన తరువాత, తిరిగి ఉతుక్కుని వినియోగించుకోవచ్చని వెల్లడించిన సంజీవ్ స్వామి, విస్తృత పరీక్షల తరువాతనే వీటిని వినియోగించవచ్చని తేల్చినట్టు తెలిపారు. ఇవి 99.9 శాతం వరకూ వైరస్ ను అడ్డుకుంటాయని తెలిపారు. అమెరికా మిలిటరీ వర్గాలు, కొందరు డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు దీన్ని వాడుతున్నారని ఆయన తెలిపారు. ఇది మానవ శరీరానికి ఎటువంటి హాని కలిగించదని నిర్ధారించారు.

ఇక ఈ మాస్క్ ల ధర విషయానికి వస్తే, ఒక్కో మాస్క్ ఖరీదు రూ. 1,490 నుంచి రూ. 1,990 మధ్య ఉంటుంది. దీన్ని దాదాపు 7 నెలల పాటు వాడుకోవచ్చని లివింగ్ గార్డ్ చెబుతోంది. ఇక ఈ మాస్క్ తో చేతి తొడుగులను తుడిస్తే, వాటిపై నిలిచివున్న వైరస్ కూడా నశిస్తుందని, ఇదే క్లాత్ తో త్వరలో బాడీ సూట్లను అభివృద్ధి చేయనున్నామని సంస్థ ప్రకటించింది. నవీ ముంబయిలోని ఓ ఫ్యాక్టరీలో ఇదే తరహా వస్త్రాన్ని తయారు చేస్తున్నామని, వారంలో 1.5 లక్షల మాస్క్ లను తయారు చేసి, ఆపై ఉత్పత్తి సామర్థ్యాన్ని దశల వారీగా పెంచుతామని, మరో వారంలో వీటి అమ్మకాలు ఆన్ లైన్ మాధ్యమంగా ప్రారంభమవుతాయని సంజీవ్ స్వామి వెల్లడించారు.


More Telugu News