గృహ హింస బాధితులకు సహకరించేందుకు ట్విట్టర్ కొత్త టూల్

  • లాక్‌డౌన్ కాలంలో దేశంలో పెరిగిన గృహ హింస
  • సెర్చ్ ప్రాంప్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ట్విట్టర్
  • క్లిష్ట సమయంలో బాధితులకు నమ్మకమైన సమాచారం
దేశంలోని గృహహింస బాధితులకు అండగా నిలిచేందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సరికొత్త టూల్‌ ‘సెర్చ్ ప్రాంప్ట్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఇది సమాచారం అందిస్తుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫాంలు రెండింటిపైనా ఇది పనిచేస్తుందని ట్విట్టర్ వెల్లడించింది. మొబైల్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్‌లలోనూ ఈ టూల్ కనిపిస్తుందని తెలిపింది. లాక్‌డౌన్ కాలంలో దేశంలో గృహ హింస పెరిగినట్టు అనేక అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలో బాధితులకు సహకరించే ఉద్దేశంతో ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ట్విట్టర్ పేర్కొంది. కాగా, మహిళల్లో చైతన్యం కలిగించేందుకు ట్విట్టర్ ఇప్పటికే మహిళా సంక్షేమ శాఖ, మహిళా కమిషన్‌తో కలిసి పనిచేస్తోంది.

ప్రభుత్వం, ఎన్జీవోలు, ప్రజలతో కలిసి పనిచేయడం వల్ల గృహ హింసను ఎదుర్కోవచ్చని తాము గుర్తించినట్టు ట్విట్టర్ ఉన్నతాధికారి మహిమా కౌల్ తెలిపారు. హింస, దుర్వినియోగానికి వ్యతిరేకంగా సాయం కోరే వారికి ఈ సెర్చ్ ప్రాంప్ట్ ద్వారా తాము అందించే సమాచారం చక్కగా పనికొస్తుందన్నారు. క్లిష్ట సమయంలో ఇది నమ్మకమైన సమాచారాన్ని అందించి సహకరిస్తుందని మహిమ వివరించారు.


More Telugu News